ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
##@@The goal is to solve people's problems@@

కాలనీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వాయిస్ ఆప్ భారత్, హనుమకొండ: ప్రజాపాలనలో భాగంగా గెలిచిన నాటి నుంచి ప్రతిరోజూ రెండు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం 4వ డివిజన్‌లోని జ్యోతి బసు నగర్‌లో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, అక్షర కాలనీలో కాలనీ నుంచి ప్రధాన రహదారి వరకు రూ.49.90 లక్షలతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే నాయిని, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రారంభించారు.

అభివృద్ధి పనుల పరిశీలన, ప్రజలతో మమేకం..
ప్రారంభించిన రోడ్డులో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మున్సిపాలిటీ సహకారంతో అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. శంకుస్థాపన చేసిన అనతికాలంలోనే పనులు ప్రారంభమయ్యేలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గడచిన 18 నెలల్లో కేవలం 4వ డివిజన్‌కు రూ.4.50 కోట్లు కేటాయించామని తెలిపారు. విషయ పరిజ్ఞానం లేని కొందరు అక్కడక్కడ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్ని డివిజన్ల ప్రజలు తమపై నమ్మకంతో ఓటు వేశారని, అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు.

ప్రతిపక్షాలపై విమర్శలు..
తాము కేటాయించిన నిధుల వివరాలను ఆధారాలతో సహా అన్ని మీడియా ముందు ఉంచుతామని నాయిని పేర్కొన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లకు పార్టీని చూసి నిధులు కేటాయించలేదని, తాము మాత్రం ప్రజల అభివృద్ధే ముఖ్యమని భావించి బీజేపీ, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల వార్డులలోనూ సమానంగా నిధులు కేటాయించామని అన్నారు. కార్పొరేషన్ సమావేశంలో ప్రజల సమస్యలపై పోరాడకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం కొద్దిమంది మాత్రమే బైకాట్ చేసి వెళ్లారని ఆయన విమర్శించారు. తమకు పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉందని, కావాలంటే సూత్రప్రాయమైన సూచనలు, సలహాలు ఇవ్వండి కానీ ప్రతి అంశంపై రాజకీయ ప్రయోజనం చూడవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *