52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌/Justice BR Gavai as the 52nd CJI

52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌/Justice BR Gavai as the 52nd CJI
Justice BR Gavai as the 52nd CJI

ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
హాజరైన ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, ప్రధాని
2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గవాయ్‌ విశేష సేవలు

వాయిస్ ఆఫ్ భారత్ : న్యూఢిల్లీ : జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of India – CJI) ప్రమాణం చేశారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తదితరులు హాజరయ్యారు. గవాయ్‌ నియామకంతో భారత చరిత్రలో ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి బౌద్ధ వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఆయన పదవీ కాలం 2025 నవంబర్‌ 23 వరకు కొనసాగుతుంది.

Justice BR Gavai as the 52nd CJI
Justice BR Gavai as the 52nd CJI

వ్యక్తిగత నేపథ్యం
పుట్టిన తేదీ: నవంబర్‌ 24, 1960
స్థలం: అమరావతి, మహారాష్ట్ర
తండ్రి: రామకృష్ణ గవాయ్‌ – మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ బౌద్ధ నేత
విద్యాభ్యాసం: నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయ డిగ్రీ
వృత్తి ప్రారంభం: 1985 మార్చి 16న న్యాయవాదిగా

న్యాయ సేవల్లో ప్రస్థానం..
జస్టిస్‌ గవాయ్‌ 2003లో బాంబే హైకోర్టులో అడిషనల్‌ జడ్జిగా నియమితులై, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 మే 24న ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆయన ముంబై, నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌, పనాజీ హైకోర్టు బెంచ్‌లలో సేవలందించారు.

జస్టిస్‌ గవాయ్‌ కీలక తీర్పులు & న్యాయపరిధిలో విశేషాలు
1. నోట్ల రద్దు కేసు (2023)
ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 26(2) కింద కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేయవచ్చని తీర్పు ఇచ్చారు. “ఏదైనా” అనే పదానికి విస్తృత అర్థం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

2. ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పు (2024)
ఎస్సీ, ఎస్టీలలో క్రీమీలేయర్‌ విధానం అమలును రాజ్యాంగబద్ధంగా గుర్తించి, ప్రత్యేక ప్రమాణాల అవసరాన్ని సూచించారు.

3. ఆర్టికల్‌ 370 రద్దు (2023)
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన కేంద్ర చర్యను సమర్థించిన ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

4. ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసు
ఈ స్కీంను రాజ్యాంగ విరుద్ధమని తేల్చిన బెంచ్‌లో సభ్యులు. పౌరుల సమాచార హక్కు ఉల్లంఘించబడుతోందని అభిప్రాయపడ్డారు.

5. ఇళ్ల కూల్చివేత కేసులు
ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో నిందితుల ఇళ్ల కూల్చివేతపై చట్టపరమైన మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు ఇచ్చారు.

6. రాహుల్‌ గాంధీ పరువు నష్టం కేసు
కుటుంబం కాంగ్రెస్‌ పార్టీతో అనుబంధం ఉందని స్వయంగా వెనక్కి తగ్గాలని యత్నించినా, చివరికి బెంచ్‌ నేతృత్వంలోనే విచారణ చేశారు.

7. తీస్తా సెతల్వాద్ బెయిల్‌ (2023)
2002 గుజరాత్ అల్లర్లలో కుట్ర ఆరోపణల కేసులో బెయిల్‌ మంజూరు చేసిన తీర్పులో కీలక పాత్ర పోషించారు.

8. మనీష్‌ సిసోడియా బెయిల్‌ (2024)
‘లిక్కర్ స్కాం’లో 17 నెలలుగా జైలులో ఉన్న మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్‌ మంజూరు చేసిన ధర్మాసనాన్ని నేతృత్వం వహించారు.

9. ప్రశాంత్‌ భూషణ్‌ ధిక్కారం కేసు
సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ట్వీట్లపై సుమోటోగా విచారణ చేపట్టిన బెంచ్‌లో సభ్యులు. ధిక్కారంగా పరిగణించారు.

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నియామకం భారత న్యాయవ్యవస్థలో సమానత్వం, నైతిక విలువలకు ప్రధానతనిచ్చే కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆయన చరిత్రాత్మకమైన నియామకంతో పాటు, న్యాయపరంగా తీసుకున్న నిర్ణయాలు దేశ న్యాయ వ్యవస్థ దిశను ప్రభావితం చేయబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *