మ్యాన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్.. గడదాసు మణికంఠ
ప్రపంచ స్థాయి గుర్తింపు
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు
మణి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్థాపన
వేల మంది విద్యార్థులకు శిక్షణ
వరించిన రికార్డులు.. అవార్డులు
మార్షల్ ఆర్ట్స్ శిక్షణతో వ్యసనాలు దూరం
ప్రతి ఒక్కరూ కళలు కంటారు.. కానీ, కొందరు మాత్రమే వాటిని సాకారం చేసుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో ఒకరిగా నిలుస్తారు ఓరుగల్లు ముద్దుబిడ్డ గడదాసు మణికంఠ. చిన్నతనంలో సినిమాలలో ఫైట్స్, పోరాటాలను చూసి మార్షల్ ఆర్ట్స్ పై ఆసక్తి పెంచుకున్నఅతడు అంచెలంచెలుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయి పోటీలలో గెలుపొంది ఉన్నత స్థానానికి ఎదిగి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి పంచాలనే గొప్ప సంకల్పంతో ఒక అకాడమీని సైతం నెలకొల్పి వేల మంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ లోని అన్ని విద్యలను అవపోషాన పట్టి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. యువకుడే అయినప్పటికీ ఉన్నతమైన ఆలోచనతో ఉత్తమ సమాజ నిర్మాణంలో తన వంతు బాధ్యతను గుర్తిరెరిగి గడదాసు మణికంఠ రాకెట్ లా దూసుకెళుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి –
కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం..
వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన గడదాసు ఆంజనేయులు-ఉమారాణి దంపతులకు జులై 1, 1992లో మొదటి సంతానంగా గడదాసు మణికంఠ జన్మించారు. ఇతడికి ఒక సోదరి శబరిమల-బావ హరికృష్ణ ఉన్నారు. బావ హరికృష్ణ ఒక ఫార్మా కంపెనీ అధినేత కాగా, తండ్రి డీసీఎం మెకానిక్ గా పనిచేస్తున్నారు. తల్లి ఉమారాణి గృహిణి. గడదాసు మణికంఠ విద్యాభ్యాసం వరంగల్ నగరంలోని కొనసాగింది. శివనగర్ లోని వందన హైస్కూల్లో పదవ తరగతి వరకు చదివారు. ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. మాస్టర్ జి డిగ్రీ కళా కళాశాలలో డిగ్రీ చదివారు.

మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి..
వందన హైస్కూల్ లో కరాటే మాస్టర్ అశోక్ సారధ్యంలో 2005లో మార్షల్ ఆర్ట్స్ పై గడదాసు మణికంఠకు మొదటగా ఆసక్తి కలిగింది. స్కూల్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో మణికంఠ చురుకుతనాన్ని గుర్తించిన మాస్టర్ అశోక్, స్కూల్ ప్రిన్సిపాల్ శ్యాంసుందర్-విజయలక్ష్మి, స్నేహితులు, తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో మార్షల్ ఆర్ట్స్ లో మరింతగా రాటు దేలాడు. విద్యార్థి దశలోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీల వరకు వెళ్లి పలు పతకాలు సాధించాడు. 2007లో ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ పొందాడు. 2009లో సొంతంగా స్కూల్ విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణను ఇవ్వడం ప్రారంభించాడు.

మణికంఠ మార్క్…
కరాటే కాకుండా మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న వివిధ విభాగాల్లో గడదాసు మణికంఠ గొప్ప నైపుణ్యాన్ని సాధించారు. తైక్వాండో, జూడో, జూజిస్తూ, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, ఎంఎంఏతో పాటు వాస్తవిక ఆత్మరక్షణ, కర్ర సాము, కత్తి సాము, నాన్ చాక్ లతో పాటు మరిన్ని మార్షల్ ఆర్ట్స్ విద్యలలో గొప్ప నైపుణ్యం సాధించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలోనే కాకుండా ప్రపంచ స్థాయి పోటీలలో రాణించాలనే పట్టుదలతో 2022లో ఇటలీ దేశంలో జరిగిన ఎఫ్ఎస్ కేఏ ప్రపంచ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని దేశానికి కాంస్య పతకం సాధించారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా గడదాసు మణికంఠ నిలవడం అరుదైన విషయం. అలాగే 2023లో కజకిస్తాన్ దేశంలో జరిగిన ఎఫ్ఎస్ కేఏ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సైతం పాల్గొని బంగారు, కాంస్య పతకాలను దేశానికి అందించి మరో రికార్డు నెలకొల్పారు. వీటితో పాటు బెంగళూరు, గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై, కొలకత్తా, ఉత్తరాఖండ్, నేపాల్, దుబాయ్, అబిదాబీ, స్విట్జర్లాండ్ దేశాలలో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రదర్శనలు ఇవ్వడమే కాక పలు పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ పతకాలతో పాటు గ్లోబల్ వరల్డ్ రికార్డ్ సంస్థ ద్వారా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అనేక గ్రాండ్ ఛాంపియన్ షిప్ లను గెలుపొంది సినీనటుడు, మార్షల్ ఆర్ట్స్ లో మంచి పేరున్న సుమన్, రాష్ట్ర మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ,మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ పసునూటి దయాకర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, గంటా రవికుమార్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు తదితర ప్రముఖుల నుంచి మన్ననలు అందుకున్నారు.

రికార్డులు.. అవార్డులు..
చెన్నైలో జరిగిన లార్జెస్ట్ కరాటే లెస్సన్స్ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నారు. మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ నుంచి గడదాసు మణికంఠ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ పురస్కార్ అవార్డును అందుకున్నారు. ఆయన తన ప్రతిభతో 2022లో జాతీయ, 2024లో అంతర్జాతీయ బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 2023లో సోషల్లీ పాయింట్ ఫౌండేషన్ నుంచి మార్షల్ ఆర్ట్స్ లో ప్రౌడ్ ఆఫ్ ఇండియా అవార్డు తీసుకున్నారు. బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ద్వారా 2023లో బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ టీచర్ అవార్డు పొందారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సైతం చోటు సంపాదించుకున్నారు. స్పోర్ట్ ఇంటర్నేషనల్ యూనిట్ సర్వీస్ వారు మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తున్న మణికంఠకు బెస్ట్ కోచ్ అవార్డుతో పాటు వారి సంస్థలో అనుసంధానం చేసుకోవడం విశేషం. వీటితో పాటు మణికంఠ సేవలను గుర్తించిన పలు సంస్థలు అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు.

తన పేరుతో అకాడమీ స్థాపన..
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే కాకుండా తనకు వచ్చిన విద్యను అందరికీ పంచాలనే గొప్ప సంకల్పంతో గడదాసు మణికంఠ మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్ నెస్ అకాడమీ నెలకొల్పారు. ఈ అకాడమీ ద్వారా నగరంలోని ప్రముఖ విద్యా సంస్థలైన గోల్డెన ఓక్ స్కూల్, న్యూ రైసింగ్ సన్ హై స్కూల్, సెయింట్ జోసెఫ్ హై స్కూల్, కౌటిల్య స్కూల్ వికాస్ నగర్, లిటిల్ మాస్టర్ హై స్కూల్ లోని విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు కేవలం మార్షల్ ఆర్ట్స్ నే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం లాంటి అంశాలపైన కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు యువతీ యువకులను సెల్ ఫోన్, డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యసనాల బారి నుంచి దూరం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతూ వారికి ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందిస్తూ ఉత్తమ సమాజ నిర్మాణానికి పాటుపడుతున్నారు. మార్షల్ ఆర్ట్స్ ను దగ్గర చేసేందుకు వేసవి, శీతాకాలాలలో ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ నగర ప్రజలందరికీ మార్షల్ ఆర్ట్స్ తో పాటు నాన్ చాక్, కత్తి సాము, కర్ర సాము మరికొన్ని ఆయుధ శిక్షణలను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కేవలం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారి ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దుతూ ప్రోత్సహిస్తున్నారు. దేశానికి తన విద్యార్థులు కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకు రావాలనే ఉక్కు సంకల్పం, అంకుఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు.

పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ..
మార్షల్ ఆర్ట్స్ పై ఆసక్తి ఉన్న నిరుపేద విద్యార్థులను, అలాగే ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారికి మార్షల్ ఆర్ట్స్ లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. శిక్షణతో ఇవ్వడంతో పాటు జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. వరంగల్ నగరంలో దాదాపు 2000 మంది విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ లో సుశిక్షితులుగా తీర్చిదిద్దడం విశేషం. వీరిలో కొందరు పలు పోటీలలో పాల్గొని పతకాలు కూడా సాధించారు. అయితే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో జరిగే వివిధ ఛాంపియన్ షిప్ లలో పాల్గొనేందుకు విద్యార్థులు తీసుకెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ కంపెనీలు, సంస్థలు ముందుకు వచ్చి స్పాన్సర్లుగా వ్యవహరిస్తే మరింత మంది విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తీర్చిదిద్దుతానని గడదాసు మణికంఠ చెబతున్నారు.

