Freedom of expression should be respected/ భావస్వేఛ్చను గౌరవించాలి
అది ప్రాథమిక హక్కు కిందకే వస్తుంది
సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
వాయిస్ ఆఫ్ భారత్ : న్యూఢిల్లీ : కవిత్వం, నాటకం, రంగస్థల ప్రదర్శనలు, వ్యంగ్యం, కళల ద్వారా భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ హక్కును గౌరవించాలని, పరిరక్షించాలని పేర్కొంది. ‘ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో’ అనే కవితను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకు గుజరాత్ పోలీసులు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హిపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసును సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. భావ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడానికి కోర్టులు ఎప్పుడూ ముందుండాలని ధర్మాసనం వెల్లడించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, ‘‘ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అత్యంత విలువైన హక్కులు. ప్రభుత్వాలు లేదా అధికార ప్రతినిధులు అసమ్మతిని తమ అధికారం మీద ముప్పుగా భావించి అణిచివేయకూడదు’’అని స్పష్టం చేసింది.
ఆంక్షలు సహేతుకంగా ఉండాలి..
జస్టిస్ భుయాన్ మాట్లాడుతూ, ‘‘వాక్ స్వేచ్ఛపై పెట్టే ఆంక్షలు సహేతుకమైనవే కావాలి. అవి ప్రజల హక్కులను హరించేలా ఉండకూడదు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తీకరించే హక్కును ప్రభుత్వం లేదా పోలీసులు కప్పివేయలేరు. ఈ హక్కును పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత’’అని పేర్కొన్నారు. జస్టిస్ ఓకా మాట్లాడుతూ, ‘‘కవిత్వం, నాటకం, సినిమాలు, కళలు వ్యక్తుల భావోద్వేగాలను వ్యక్తీకరించేందుకు గొప్ప సాధనాలు. ఒక అభిప్రాయాన్ని మెజారిటీ నచ్చుకోలేదనే కారణంతో అణచివేయడం సముచితం కాదు. పోలీసులు భిన్నాభిప్రాయాలను గౌరవించాలి, అవి ప్రజాస్వామ్య విధుల్లో భాగమే’’అని తెలిపారు.
ఆర్టికల్ 21తో అనుసంధానం..
వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం అసాధ్యం అని జస్టిస్ ఓకా అభిప్రాయపడ్డారు. ‘‘పోలీసులు, ప్రభుత్వం భావ స్వేచ్ఛను పరిరక్షించడంలో విఫలమైతే, కోర్టులు జోక్యం చేసుకుని పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత వహించాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. గుజరాత్ పోలీసులు కుల, మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో ఇమ్రాన్ ప్రతాప్‌గర్హిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కవిత అసలు అహింసను సూచించేదని, మహాత్మా గాంధీ అనుసరించిన మార్గాన్ని ప్రతిబింబించేదని సుప్రీం కోర్టు పేర్కొంది.
