CM REVENTH LETTER/కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం లేఖ
ప్రాజెక్టుపై కలిసిన విషయాన్ని గుర్తుచేసిన రేవంత్
మెట్రో విస్తరణకు ఐదు కారిడార్ల ప్రతిపాదన
తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్
వాయిస్ ఆఫ్ భారత్, తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి 9 పేజీల లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ లేఖ రాశారని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రంగా ఆయన చేసిన కృషిని వెల్లడించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, ప్రాంతీయ రింగు రోడ్డు (RRR),మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్, బందరు సీ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ రహదారి వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.
మెట్రో ఫేజ్-1 (69 కి.మీ.) నిర్మాణాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత పది సంవత్సరాల్లో BRS ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, తన ముఖ్యమంత్రి పదవీ స్వీకార అనంతరం మెట్రో ఫేజ్-2 పై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని తెలిపారు. మెట్రో సేవల విస్తరణ కోసం ఐదు కారిడార్ల ప్రతిపాదనలు సమర్పించామని వివరించారు.
ప్రతిపాదిత మెట్రో కారిడార్లు:
నాగోల్ – రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.)
రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.)
ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.)
మియాపూర్ – పటాన్ చెరు (13.4 కి.మీ.)
ఎల్‌బీనగర్ – హయత్ నగర్ (7.1 కి.మీ.)
ఈ ఐదు కారిడార్ల నిర్మాణానికి రూ. 24,269 కోట్ల వ్యయం అవుతుందని, ఆమోదం కోసం 2024 జనవరి 4న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి, అక్టోబర్ 7న మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. నవంబర్ 4న మెట్రో ఫేజ్-2 వివరమైన ప్రణాళికను కేంద్రానికి అందజేశామని, డిసెంబర్ 12న ఢిల్లీలో కిషన్ రెడ్డికి లేఖ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
తాజాగా, ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఇదే అంశంపై లేఖ అందజేశానని సీఎం పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-2కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సహకరించాలని అన్ని లేఖల్లో స్పష్టంగా వివరించామని తెలియజేశారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు:
2024 జులై 22న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు గురించి వివరాలతో కూడిన లేఖ అందించామని పేర్కొన్నారు. కిషన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించామని గుర్తు చేశారు. ఫిబ్రవరి 21న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ అధికారులు కిషన్ రెడ్డిని కలిసి ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారని పేర్కొన్నారు. తాజాగా, ప్రధానమంత్రి మోదీకి కూడా మూసీ పునరుజ్జీవంపై లేఖ అందజేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
