NEW RATION CARDS/ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతున్న వేళ..
మార్చి 1 నుంచే కొత్త రేషన్‌కార్డులు
లక్ష కార్డులు పంపిణీ చేయనున్న అధికారులు
వాయిస్ ఆఫ్ భారత్, తెలంగాణ : పేదలకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆశ నేటి రోజే నెరవేరుతుంది. గత పదేళ్లుగా అన్ని అర్హతలు ఉన్న తెల్లరేషన్ కార్డుల లభ్యత లేకపోవడం వలన అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నూతన రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం మార్చి 1 నుండి కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒకే రోజు లక్షల కార్డులను పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపారు.
కొత్త జిల్లాల వారీగా పంపిణీ సంఖ్య ఇలా ఉంది:
హైదరాబాద్: 285,000
వికారాబాద్: 220,000
నాగర్‌కర్నూల్: 150,000
నారాయణపేట: 120,000
వనపర్తి: 60,000
మహబూబ్‌నగర్: 130,000
గద్వాల్: 130,000
మేడ్చల్ మల్కాజిగిరి: 60,000
రంగారెడ్డి: 240,000
మార్చి 8 తరువాత, ఇతర జిల్లాల్లో కూడా కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపారు. గత దశాబ్దంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడకపోవడంతో లక్షల మంది వివాహాలు చేసుకుని వేరుకాపురాలు ఏర్పడినప్పటికీ, అనేక ప్రభుత్వ పథకాలు అందలేకపోయాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 26న 16,900 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేసిన నేపథ్యంలో, ఇప్పటికీ ప్రజాపాలన, గ్రామ సభలలో దరఖాస్తులు స్వీకరించి, మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అప్లికేషన్లు సేకరించబడుతున్నాయి. అర్హతను పరిశీలించి, తదుపరి నూతన కార్డులను జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
