TRS KTR/ఇందిరమ్మ రాజ్యంలో ప్రాణాలకు విలువ లేదు
కాంగ్రెస్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శ
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మంది ప్రాణాలు పోయే ప్రమాదం చోటుచేసుకున్నా, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారని ధ్వజమెత్తారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది అదృశ్యమైన ఈ విషమ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం దిగజారుడు రాజకీయమే అని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఓట్ల వేటలో మాత్రం దూసుకుపోతున్నారని విమర్శించారు. ఇలాంటి ఘోర ప్రమాదం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. “జిల్లా జిల్లాకు తిరిగి ఓట్ల కోసం ప్రచారం చేసే సమయం ఉంది, కానీ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించే టైమ్ లేదు” అని నిలదీశారు. ఇది ప్రజాపాలనకా? లేక నోట్ల, ఓట్ల వేటకా? అంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే, క్షతగాత్రులను రక్షించేందుకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా సర్కారు చేతులెత్తేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని, తగిన సమయానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
