RENT CAR SALE/అద్దె కార్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
పోలీసుల అదుపులో సూత్రధారి విశ్వ ఫణీంద్ర
విక్రయిసంచిన 26 కార్ల స్వాధీనం
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : అద్దెకు తీసుకున్న కార్లను విక్రయిస్తూ మోసం చేస్తున్న ముఠాను పోలీసులు బహిర్గతం చేశారు. ఈ ముఠా సూత్రధారి విశ్వ ఫణీంద్రను అరెస్ట్ చేసి, అతని నుంచి 26 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఏపీ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన విశ్వ ఫణీంద్ర జీవనోపాధి కోసం హైదరాబాద్ గాజులరామారంలో వీవీఆర్ కార్ ట్రావెల్స్ సంస్థను ప్రారంభించాడు. ఆయన కారు యజమాని శశిధర్‌తో వాహన లీజు ఒప్పందం చేసుకొని మొదట్లో కొన్ని నెలల పాటు అద్దె చెల్లించాడు. అయితే, తరువాత బకాయిలు పెంచుతూ కార్యాలయం మూసేసి పారిపోయాడు. ఈ నేపథ్యంలో శశిధర్ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో అతని మోసపూరిత కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో విశ్వ ఫణీంద్ర అనేక మందితో అద్దె ఒప్పందాలు చేసి, కార్లను విక్రయించినట్లు గుర్తించారు. ఈ స్కామ్‌లో మరో ముగ్గురు రమణ, సత్యనారాయణ, వెంకటేశ్‌ల పాత్ర ఉందని తేల్చారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలంగాణలో తాకట్టు పెట్టిన కొన్ని కార్లు, ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ధరకు విక్రయించిన మొత్తం 26 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అంచనా.
పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
