తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌

తెలంగాణలో  మెగా డిఎస్సీ  నోటిఫికేషన్‌
  • ప్రకనను విడుదల చేసిన సిఎం రేవంత్‌ రెడ్డి
  • 11వేల 62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు
  • మార్చి 4 నుంచి ఎప్రిల్‌ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ


వాయిస్ ఆఫ్ భారత్ (తెలంగాణ న్యూస్) : నిరుద్యోగులకు తీపి కబురు అందింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వారికి తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ ను సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. 11వేల 62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. గతంలో అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లు మాత్రం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు అన్‌లైన్‌లో స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఆన్‌ లైన్‌లో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది. అభ్యర్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 46గా నిర్థారించారు. కాగా గతేడాది సెప్టెంబరు 6న 5 వేల 89 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను ఫిబ్రవరి 28 బుధవారం రాత్రి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోస్టులను అదనంగా పెంచి నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిల్లో గత కేసీఆర్‌ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్‌ పోస్టులు, మరో 1, 016 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు కలిపి మొత్తం 11, 062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
మే నెలలో డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉన్నది. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ స్జబెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాప్ట్‌వేర్‌ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు. పాస్‌వర్డ్స్‌, ఆన్‌లైన్‌ వ్యవస్థ భద్రతాంశాలను ఉన్నతాధికారులు సవిూక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు. కీలకపాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్నీ పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *