ధరణి గైడ్ లైన్స్ జారీ
- త్వరలో ధరణిపై కొత్త సర్క్యులర్..
- కిందిస్థాయిలోనే పూర్తయ్యేలా..
- అప్రూవ్ చేసినవి ఈజీ..
వాయిస్ ఆఫ్ భారత్ ( తెలంగాణ న్యూస్) : ధరణి మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తహసీల్దార్లు, ఆర్డీవోలకు అధికారాలను బదలాయించింది. జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏ లకు అధికారాలను బదలాయిస్తునట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఆ మార్గదర్శకాల్లో వెల్లడించింది.
త్వరలో ధరణిపై కొత్త సర్క్యులర్..
‘భూమాత’ను తీసుకువచ్చే ముందు.. ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రక్రియను మార్చి మొదటివారం నుంచి ప్రారంభించాలని అనుకుంటొంది. అయితే మండల స్థాయిలో పరిష్కార బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఆ పై ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో పరిష్కారానికి ధరణి కమిటీ సభ్యులు, సీసీఎల్ఏ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. నేడు మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సమాచారం. దాదాపుగా మండల, డివిజన్ స్థాయిలోనే పని పూర్తయ్యేలా గైడ్ లైన్స్ తయారు చేస్తున్నట్లు తెలిసింది.
కిందిస్థాయిలోనే పూర్తయ్యేలా..
ఏ పని ఎవరు చేయాలి? ఏయే పనులను కలెక్టర్‌కి అప్పగించాలి? సీసీఎల్ఏ దాకా వచ్చే జఠిలమైన సమస్యలు ఏమిటి? అన్న అంశాలపై బుధవారం కసరత్తు జరిగింది. ఇందులో అనేకాంశాలు కింది స్థాయిలోనే పూర్తి చేయాలన్న ఏకాభిప్రాయానికి ధరణి కమిటీ, అధికారులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆర్వోఆర్ 2020 చట్టం ద్వారా బాధ్యతలు లేదా అధికారాలు అప్పగింతపై అనుమానాలు ఉన్నాయి.
తహశీల్దార్లకు అధికారాలు చట్ట ఉల్లంఘన
తహశీల్దార్లకు నిర్ణయాత్మక అధికారాలను కట్టబెట్టడం ద్వారా చట్ట ఉల్లంఘన అవుతుందన్న చర్చ నడుస్తున్నది. అయితే దీనికి మధ్యే మార్గంగా కనీసం పెండింగ్ దరఖాస్తుల వరకు వేగవంతంగా పూర్తయ్యేటట్లుగా సర్క్యులర్ జారీ చేయనున్నట్లు సమాచారం. నేడో, రేపో సీసీఎల్ఏ నుంచి మండల స్థాయి హెల్ప్ డెస్కుల నిర్వహణ, దరఖాస్తుల పరిష్కారానికి తహశీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు సత్వరం చేయాల్సిన పనులపై ఆదేశాలు అందనున్నాయి.
రిపోర్ట్ పంపింది వారే..
భూ సమస్యలకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్నా ఆ సమస్యల పరిష్కారానికి తహశీల్దార్లే కలెక్టర్లకు రిపోర్టులు పంపారు. పెండింగ్ దరఖాస్తులపైనా నివేదికలు పంపి నెలలు గడుస్తున్నది. ఇన్నేళ్లుగా సీసీఎల్ఏ, కలెక్టర్ల స్థాయిలో పెండింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడా దరఖాస్తుల పరిష్కార బాధ్యతలను తహశీల్దార్లకే అప్పగించడం ద్వారా ఈజీగానే పరిష్కరించవచ్చనే అభిప్రాయం ధరణి కమిటీ సభ్యులకు ఉంది. తహశీల్దార్లకు వాటిపై అవగాహన ఉంటుంది. పైగా దరఖాస్తుదారుడు మండల స్థాయిలో అధికారిని స్వయంగా కలిసి సమస్యను చెప్పుకునేందుకు కూడా వెసులుబాటు కలుగుతుంది. కొన్నింటిని మాత్రమే కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో పరిష్కరించేందుకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం.
వాటితోనే ఇబ్బంది
డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్ సమస్యల పరిష్కారం కష్టంగా మారింది. పెరిగిన భూ విస్తీర్ణంతో సర్వే నంబర్ల మిస్సింగ్, ఎక్కువ/తక్కువ సవరణలు చేయలేకపోతున్నారు. అసాధ్యమేం కాదు. కానీ పాత రికార్డులన్నీ వెరిఫై చేసే సిబ్బంది అవసరమని అధికారులు అంటున్నారు. ఏ రైతు ఖాతా నుంచి అమ్మేసిన భూమిని తొలగించాలో డేటా వెతికితే సవరణ చేయడం కష్టం కాదు. అయితే ప్రతి సంవత్సరం రికార్డును పరిశీలించి అధికంగా పడిన రైతు ఖాతా నుంచి తొలగించొచ్చు. కానీ ఇప్పటి దాకా ఈ దరఖాస్తులను పెండింగ్ పెట్టారు. ఆఖరికి డేటా తప్పుగా పడిందంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చిన బాధితులకు కూడా న్యాయం చేయడం లేదు. తప్పొప్పుల సవరణ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. కానీ తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తూ రెండేండ్లుగా రైతులను తిప్పించుకుంటున్న కలెక్టర్లు, తహశీల్దార్లు ఉన్నారు. ఇప్పుడీ స్పెషల్ డ్రైవ్ లో ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
అప్రూవ్ చేసినవి ఈజీ..
తమ పాసు పుస్తకం/ధరణి పోర్టల్ లో సర్వే నంబరు మిస్సయ్యిందని, విస్తీర్ణం తక్కువ పడిందంటూ టీఎం 33 కింద వేలాది అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ల ఫైళ్లను పరిశీలించి కొనుగోలు లేదా వారసత్వంగా వచ్చిన భూమి అని, విస్తీర్ణం తక్కువగా పడిందని, సర్వే నంబరు మిస్సయ్యిందన్న మాట వాస్తవమేనంటూ తహశీల్దార్లు రిపోర్టు చేస్తున్నారు. ఆఖరికి రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు ఫీల్డ్ మీదికి వెళ్లి ఖాతాలో పేర్కొన్నట్లుగా విస్తీర్ణం ఉందా? లేదా? అని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో విచారించి పంపిన నివేదికల ఆధారంగానే కలెక్టర్లు అప్రూవ్ చేశారు. ఐతే జిల్లా కలెక్టర్ అప్రూవ్ చేశారంటూ ధరణి పోర్టల్ స్టేటస్ రిపోర్టులో కనిపిస్తున్నది. కానీ నెలలు గడిచినా సీసీఎల్ఏ మాత్రం అప్రూవ్ చేయలేదు. ఫైళ్లు చూసి సర్వే నంబరులోని మొత్తం విస్తీర్ణాన్ని లెక్కించి అదనంగా ఉందంటూ తిరస్కరించిన ఉదంతాలు ఉన్నాయి. మేం కొనుగోలు చేశాం. పొషెషన్ లో ఉన్నాం. రండి చూసుకోండంటూ వేడుకున్నా .. మాకేం తెలియదు. ఎవరి ఖాతాలో నుంచైనా తగ్గిస్తే తప్ప మీ విస్తీర్ణాన్ని, మిస్సింగ్ సర్వే నంబర్ ని సరి చేయలేం అంటున్నారు. కానీ కలెక్టర్లు అప్రూవ్ చేసినవి పరిష్కరించడం పెద్ద కష్టం కాదు.
