మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారు..?

మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారు..?
  • బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి
  • ఇండియా కూటమిని కాంగ్రెస్ కాపాడుకోవాలి
  • బీజేపీ మతం పేరుతో బతుకుతోంది
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్): మేడిగడ్డకు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వెళుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం హనుమకొండ బాల సముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ హయాంలోనే నిర్మించిన మేడిగడ్డ కుంగిందని, అన్నారం బ్యారేజీలో పగుళ్లు ఏర్పడినాయని, పైగా మేడిగడ్డను బొందలగడ్డ అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని, అలాంటి బొందలగడ్డకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణులు ఏది చెపితే అది చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం, మంత్రులు చెప్పారని, నిపుణులు త్వరగా తేల్చితే పరిష్కారం దొరుకుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపాలున్నాయని స్వయంగా కాగ్ రిపోర్టులోనే అనేక లోపాలు ఎత్తి చూపారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ ప్రజలకు ఏ సమాధానం చెపుతారని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద 28వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తే గ్రావిటీ ద్వారా 16 లక్షల ఎకరాలకు నీరందేదని, నేడు 93వేల కోట్లతో కాళేశ్వరం నిర్మించినా సాధించిందేమిటని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు అధికారం లేకపోయే సరికి చిన్నపిల్లల మాదిరిగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో సీపీఐ ఎన్నికలలో కలవడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని, కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోట ఎక్కువ స్థానాలు గెలిచారని, రానున్న పార్లమెంటు ఎన్నికలలోనూ ఇండియా కూటమిని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ దేనని అన్నారు. రాష్ట్రంలో సీపీఐకి ఒక పార్లమెంటు స్థానం ఇవ్వాలని తాము కోరుతున్నామని, పార్లమెంటులోనూ తమ గొంతు వినిపించేదుకు ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గడిచిన సింగరేణి ఎన్నికలలో ఏఐటీయూసి గెలవడంతో పాటు ఆర్టీసి, బ్యాంకు తదితర అనేక రంగాలలో బలంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలైన ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు జమచేయడం లాంటివి నెరవేర్చకుండా ప్రజలకు అబద్దాలు చెప్పి, భావోద్వేగాలను రెచ్చగొట్టి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నదని, ప్రజలు ఈ సారి వారికి తగిన గుణపాఠం చెపుతారని అన్నారు. బీజేపీ మతతత్వ విధానాలతో రాముని పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నదని, ఐదు వేల ఏళ్ల క్రితమే రాముని చరిత్ర ఉందని, కొత్తగా బీజేపీ సాధించిందేమీ లేదని అన్నారు. అబద్దాలు, భావోద్వేగాలు పని చేయవని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి. విజయ సారథి, నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, నాయకులు సిరబోయిన కర్ణాకర్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు కొట్టెపాక రవి, బాషబోయిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *