చంపుతున్న.. చైనా మాంజా!
- విచ్చలవిడిగా విక్రయాలు
- కొనుగోలుకు మొగ్గు చూపుతున్న యువత
- వినోదం మాటున పొంచి ఉన్న ప్రాణ హాని
- పట్టించుకోని అధికారులు
- పతంగులు ఎగరేసే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పగటి పూటే తారలు దిగివచ్చినట్లుగా.. నింగికి నిచ్చెన వేసినట్టుగా ఎగిరే రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. ప్రతిసారిలాగే.. ఈ ఏడాది కూడా విభిన్న రకాల పతంగులు దర్శనమిస్తున్నాయి. పండుగ ముందు పతంగుల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. అయితే పతంగుల మాటున ప్రమాదకరమైన చైనా మాంజా కూడా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. పక్షుల ప్రాణాలు తీయడంతోపాటు ఏమరుపాటుగా ఉంటే ప్రజల ప్రాణాలను సైతం హరిస్తున్న చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినా స్థానికంగా విక్రయాలు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాంజా కొనుగోలుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. అయితే చైనా మాంజా విక్రయాలపై అధికారులు చూసీ చూడనట్లుగా కాకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-వాయిస్ ఆఫ్ భారత్ , వరంగల్
సంక్రాంతి వచ్చిందంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా కైట్స్ ఎగరవేస్తారు. ఆహ్లాదాన్ని పంచి, సంతోషాన్ని నింపాల్సిన ఈ పతంగులు.. విషాదాన్ని నింపుతున్నాయి. కైట్స్ ఎగరేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. సన్నటి తీగలాంటి ఈ మాంజా కాటుకు మనుషులే కాదు పశుపక్ష్యాదుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చైనా మాంజాపై నిషేధం ఉన్నా.. మార్కెట్లో యథేచ్చగా దీనిని విక్రయిస్తున్నారు.
పతంగులే ఆకర్షణ..
సంక్రాంతి పండుగకు పతంగులు ప్రత్యేక ఆకర్షణ. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు రకరకాల కైట్స్ ఎగరవేస్తూ సందడి చేస్తుంటారు. సంతోషంగా జరుపుకునే పండుగలు.. ఆనందాన్ని రెట్టింపు చేయాలి కానీ, విషాదాన్ని నింపొద్దు. అయితే, ఈ పండుగ సమయంలో పిల్లలు, యువత పోటీ పడి మరి పతంగులు ఎగురేస్తుంటారు. ఈ క్రమంలో ఒకరి కంటే ఒకరు ఎదుటి వారి పతంగిని తెంచేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందు కోసం విష రసాయనాలతో తయారు చేసిన చైనా మాంజాను వాడుతున్నారు. సన్నగా.. తీగలాగా షార్ప్ గా ఉండే దీనితో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. చేతులు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది.
ఎలా తయారు చేస్తారంటే..
చైనా మాంజాను నైలాన్‌తో తయారు చేస్తారు. గాజు పొడి పూసిన నైలాన్, సింథటిక్ దారాలను మాంజా తయారీలో వాడుతారు. కైంచీ (వేరే పతంగ్ దారానికి మెలిక వేసి తెంపటం) వేసిన సమయంలో చైనా మాంజా పతంగ్ తెగకుండా ఉండడంతో పాటు ఎదుటివారి పతంగిని తెంపుతుండడంతో యువత ఎక్కువగా ఈ రకం మాంజానే వినియోగిస్తున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం..
పతంగుల నుంచి తెగిపోయిన మాంజా దారం చెట్టు కొమ్మలు, కరెంట్ తీగలు, స్తంభాలు, భవనాలపై ఇలా ఎక్కడ పడితే అక్కడ చిక్కుకుంటుంది. గాలికి ఎగిరొచ్చి రోడ్లపై నుంచి అడ్డంగా వెళ్తుంది. ఇది వాహనదారులకు కనిపించదు. ఈ క్రమంలో వారికి తగిలి ప్రాణాంతకంగా మారుతోంది. తేరుకునే లోపే మెడకు చిక్కుకొని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ మాంజా పశుపక్ష్యాదుల ప్రాణాలను సైతం తీస్తుంది. అందుకే, చైనా మాంజా వాడొద్దని, ఎదుటివారి కుటుంబాల్లో విషాదాలు నింపొద్దని పక్షి ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నూలుతో తయారు చేసిన దారం వాడితే ఎలాంటి ప్రమాదాలు జరగవని చెబుతున్నారు. పిల్లలతో పాటు పెద్దవాళ్లు పతంగులు ఎగురేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. పతంగుల మోజులో పడి బిల్డింగులు, డాబాల పైనుంచి కింద పడే ప్రమాదం ఉంది. ముందూ వెనుక చూసుకోకుండా భవనాలపై పతంగులు ఎగరేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలా ప్రమాదానికి గురై మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు..
చైనా మంజా చాలా ప్రమాదకరమైందని, దాన్ని ఉపయోగించకూడదని ప్రభుత్వం పేర్కొంటుంది. చైనా మాంజా విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతోంది. అయిన్పటికీ అక్కడక్కడ కొందరు వ్యాపారులు చైనా మాంజాను విక్రయిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, ఈ పతంగుల కోసం స్థానికంగా తయారు చేసిన దారాన్ని మాత్రమే విక్రయిస్తున్నామని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారు. అది కూడా ఆధార్‌కార్డు జిరాక్స్ ఇచ్చిన వారికే మాత్రమే మాంజా విక్రస్తున్నామని చెబుతున్నారు. పిల్లలు, యువత చైనా మాంజా కొనుగోలు చేయవద్దని, ప్రమాదాలకు కారణం కావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది.
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..
చిన్నారులు, యువత పతంగులను ఎగురవేసే సమయాల్లో పలు జాగ్రత్తలను పాటిస్తే పండుగను సంతోషంగా జరుపుకోవచ్చంటూ పోలీసులు సూచిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో మాత్రమే పతంగులను ఎగురవేయాలని,
విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉండే చోట పతంగులను ఎగురవేసే సమయాల్లో జాగ్రత్తలు పాటించాలని, పెద్ద పెద్ద భవనాలు, కొండ ప్రాంతాల్లో పతంగులను ఎగురవేయకపోవడమే శ్రేయస్కరం అంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన చైనా మాంజాను ఉపయోగించి పతంగులను ఎగురవేయరాదని, పతంగులు ఎగురవేసే సమయంలో చిన్నారులను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని హెచ్చరిస్తున్నారు.

