30 నుంచి శ్రీ శ్వేతార్క గణపతి స్వామి 27వ వసంతోత్సవం
ఐదు రోజల పాటు వైభవంగా వేడుకలు
వివరాలు వెల్లడించిన ఆలయ నిర్వాహకులు
వాయిస్ ఆఫ్ భారత్, కాజీపేట : స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి స్వామి వారి 27వ వసంతోత్సవ-కళ్యాణోత్సవాలను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వైదిక నిర్వాహకుడు రాధా కృష్ణ శర్మ, పరిపాలన నిర్వాహకుడు సాయికృష్ణ శర్మ, ఆలయ చైర్మన్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ వైదిక నిర్వాహకులు రాధా కృష్ణ శర్మ, పరిపాలన నిర్వాహకుడు సాయికృష్ణ శర్మలు మాట్లాడుతూ పూజా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మే 2న స్వామి వారి పుట్టిన రోజు సందర్భంగా విశ్వరూప దర్శనం, మే 4న సిద్ది, బుద్ధి శ్వేతార్క గణపతి మహ కళ్యాణోత్సవం రాజపట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి మే 4 వ తేదీ వరకు 5 రోజుల పాటు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. ప్రత్యేకంగా మే 2న మొట్టమొదటి సారిగా శ్రీ స్వామివారికి గజారోహణ కార్యక్రమం చేపట్టి కాజీపేట పుర వీధులలో ఊరేగించనున్నట్లు తెలిపారు. ఈ ఐదు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు పెద్దఎత్తున దేవాలయం తరపున దేవాలయంతో పాటు దేశ, విదేశాలలో భక్తులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఈ వేడుకల సందర్భంగా దేవాలయంలో డాక్టర్ సరిత ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే వేడుకలను భక్తులు, స్థానికులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. అలాగే, ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తనకు కాజీపేట శ్వేతార్క దేవాలయంతో వీడదీయలేని అనుబంధం ఉందని, దేవాయలంలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. అనంతరం శ్రీ శ్వేతారక మూలగణపతి స్వామి వారి 27వ వసంతోత్సవ-కళ్యాణోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సదానందం, తుమ్మ శ్రీనివాస్, ఆలయ పీఆర్ఓ మణి, పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు హాజరయ్యారు.

