17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
19న ఉగాది ఆస్థానం..
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
భక్తులకు కీలక సూచనలు జారీ చేసిన దేవస్థానం
వాయిస్ ఆఫ్ వందే భారత్, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 19న జరగనున్న ‘క్రోధి నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని’ పురస్కరించుకుని, మార్చి 17వ తేదీ మంగళవారం ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ నిర్వహించనున్నారు. ఏటా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం (తిరుమంజనం) చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థాన వేడుకల నేపథ్యంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 17 (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు. తిరుమంజనం దృష్ట్యా మార్చి 16న, ఉగాది ఆస్థానం దృష్ట్యా మార్చి 18న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. మార్చి 19 (గురువారం) ఉగాది ఆస్థానం సందర్భంగా కూడా కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తారు. సాధారణ భక్తులకు దర్శన సమయాల్లో ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆలయ గర్భాలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఉప ఆలయాలను పరిమళ భరితమైన మిశ్రమంతో శుద్ధి చేసే ఈ క్రతువు కారణంగా మంగళవారం ఉదయం భక్తులకు సర్వదర్శనం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.

