హుందా రాజకీయాలు నేర్చుకోండి/ congress corporaters press meet

హుందా రాజకీయాలు నేర్చుకోండి/ congress corporaters press meet
@@###Learn sober politics@@@

బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కాంగ్రెస్ హితవు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ కార్పొరేటర్లకు అన్యాయం
కాంగ్రెస్ కార్పొరేటర్లు తోట వెంకన్న, జక్కుల, విజయ, శ్రీమాన్

వాయిస్ ఆప్ భారత్, హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హనుమకొండ జిల్లా రాజకీయాలు ఎంతో హుందాతనంతో సాగుతున్నాయని, గతంలో ప్రశ్నించడమే పాపంగా చూసిన తరుణాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రాజాలీ, పోతుల శ్రీమాన్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. “హుందా రాజకీయాలు ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు నేర్చుకోవాలి. మీ హయాంలో కాంగ్రెస్ డివిజన్‌లను చిన్నచూపు చూసిన విషయం వాస్తవం కాదా?” అని కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించి స్థానాలను కేటాయించారని వారు గుర్తుచేశారు.

అభివృద్ధిపై చర్చకు సిద్ధం..
“చర్చకు మేం అన్ని విధాలుగా సిద్ధం అన్నప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలయాపన వద్దు. మీ పదేళ్లలో దేవాదాయ శాఖకు కేటాయించిన నిధులు ఎంత?” అని నిలదీశారు. వెనక్కి పోయిన స్మార్ట్ సిటీ నిధులను ముఖ్యమంత్రిని ఒప్పించి వెనక్కి తెచ్చిన నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి అని కొనియాడారు. భద్రకాళి బండ్, చెరువు అభివృద్ధి ప్రక్రియ ఈ టెండర్‌లో భాగంగా జరిగిన విషయం ప్రతిపక్షానికి తెలియకపోవడం బాధాకరమన్నారు.

కేంద్ర నిధుల దుర్వినియోగంపై ప్రశ్న..
“కేంద్ర ప్రభుత్వం ఆనాడు దేశ వ్యాప్తంగా వెనుకబడిన, హెరిటేజ్ నగరాలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసింది. మంజూరు చేసిన నిధులను సకాలంలో సద్వినియోగం చేయలేని అసమర్థులు మీరు” అని కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. కార్పొరేటర్లుగా ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో చర్చించే ఓపిక లేకుండా వెళ్లింది వారే కదా అని ప్రశ్నించారు.

మీడియా అటెన్షన్ కోసం రాజకీయం వద్దు..
“మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాం, ప్రజల సమస్యలపై పోరాటం చేశాం. మీడియా అటెన్షన్ కోసం రాజకీయాలు మానుకోండి” అని హితవు పలికారు. ప్రతిపక్షాన్ని సైతం గౌరవిస్తున్న నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి అని, అన్ని డివిజన్‌లలో సమవుజ్జి పాలుగా నిధులను కేటాయిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మామిండ్ల రాజు, నెక్కొండ కవిత కిషన్, ఏనుగు మానస రామ్ ప్రసాద్, గుంటి రజిత-శ్రీనివాస్, నాయకులు కుమార్ యాదవ్, భరత్ కుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *