స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఈటలఫైర్/ Etela fire on reservations in local bodies
రిజర్వేషన్ల ప్రక్రియపై ఆగ్రహం
రేవంత్ సర్కార్‌పై మండిపాటు
ఎన్నికల ఆలస్యంపై ఆందోళన
ముందుగా ఖర్చు చేసి ఇబ్బందుల పాలు కావద్దు
వాయిస్ ఆప్ భారత్, కమలాపూర్ : బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం కీలక మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల ప్రక్రియపై ఆయన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (రేవంత్ సర్కార్) తీరును తీవ్రంగా తప్పుపట్టారు. “రిజర్వేషన్ల ప్రక్రియ తప్పులు తడకగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో అనేక లోపాలు, పొరపాట్లు ఉన్నాయని ఈటల రాజేందర్ విమర్శించారు రిజర్వేషన్ల విషయంలో గందరగోళం సృష్టించడం ద్వారా ప్రభుత్వం ఎవరిని మోసం చేయాలని చూస్తోందని ఆయన ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలు, స్థానిక పాలన స్తంభించిపోయాయి అని, గ్రామాలు అభివృద్ధికి నోచుకోక వల్లకాడుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గందరగోళంపై ప్రభుత్వమే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై, రిజర్వేషన్లపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియపై పూర్తి స్పష్టత వచ్చేవరకూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు, నాయకులు తొందరపడవద్దని ఈటల రాజేందర్ సూచించారు. క్లారిటీ వచ్చిన తర్వాతే గ్రామాల్లో నాయకులు ఖర్చు చేయాలని, ముందుగానే అనవసరంగా ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దని ఆయన హితవు పలికారు. మల్కాజిగిరి ఎంపీ పత్రికా సమావేశం సందర్భంగా, కమలాపూర్‌లోని ఆయన నివాసం వద్ద వివిధ పదవులను ఆశిస్తున్న ఆశావాహులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఎంపీ ఈటల రాజేందర్ ఉదయం నుండే వీరందరితో చర్చలు జరుపుతూ, వారి అభిప్రాయాలు, ఆశావహ ప్రకటనలను విన్నట్లు సమాచారం.
