సురేఖమ్మ… నువ్వు సల్లగుండాలే/ KONDA SUREKHA MINISTER
మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : దేవాదాయ శాఖ పరిధిలో విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు డెత్ గ్రాట్యూటీని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు “సురేఖమ్మ… నువ్వు సల్లగుండాలే” అంటూ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపాయి. మంత్రి సురేఖ తన కార్యాలయంలో 20 బాధిత కుటుంబాలకు మొత్తం రూ. కోటి ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేశారు. ఇందులో విధి నిర్వహణలో మరణించిన ఆరుగురు ఎండోమెంట్ ఉద్యోగుల కుటుంబాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపనయనం, విద్య, వైద్య ఖర్చులకు సంబంధించిన ఆర్థిక సహాయాలు ఉన్నాయి. ఈ గ్రాట్యూటీ ప్రక్రియను వేగవంతం చేసి, తమకు త్వరితగతిన నిధులు అందేలా కృషి చేసినందుకు బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
మహిళలకు అండగా ఉంటాం: మంత్రి సురేఖ
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ఎండోమెంట్ ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమ భర్తలు మరణించడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని పలువురు మహిళలు తమ సమస్యలను చెప్పుకుని వాపోయారు. వారిని ఓదార్చిన మంత్రి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళలకు న్యాయం చేసేందుకు ఏదైనా మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. “మన దేవాదాయ శాఖ కోసం సేవలు అందిస్తున్న క్రమంలో మరణించిన వారి కుటుంబాలకు కేవలం గ్రాట్యూటీ ఇచ్చి సరిపెట్టొద్దు. ఎక్కడ ఏ విధంగా సాధ్యమైనా మన బాధ్యతగా సాయం చేయాల్సిన అవసరం ఉంది” అని అధికారులకు సూచించారు. మంత్రి సురేఖ స్పందనతో బాధిత మహిళలు కన్నీరు పెట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, వెంకటేశ్, రామకృష్ణారావు, పీఎస్ సోమరాజు, ఓఎస్డీ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సురేఖ అందజేసిన గ్రాంటు వివరాలు –
డెత్ గ్రాట్యూటీ: రూ. 8 లక్షలు
డెత్ ఎక్స్ గ్రేషియా: రూ. 50 వేలు
అంత్యక్రియల ఖర్చు: రూ. 30 వేలు
ఉద్యోగ సమయంలో అంగ వైకల్యం: రూ. 2 లక్షలు
వైద్య ఖర్చుల చెల్లింపు: రూ. 2 లక్షలు
విద్యా సదుపాయం: రూ. 2 లక్షలు
ఉపనయన గ్రాంటు: రూ. 50 వేలు

