‘శ్రీకృష్ణ రాయబారం’నాటక ప్రదర్శన
వాయిస్ ఆఫ్ భారత్, జనగామ : అంతరించిపోతున్న జానపద కళలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో మేధావులు ఒక బృందంగా ఏర్పడి ‘శ్రీకృష్ణరాయబారం’నాటకాన్ని ప్రదర్శించారు. జనగామలోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నాటకంలో ప్రముఖ పండితుడు అయ్యప్ప శాస్త్రి శ్రీకృష్ణుడి పాత్రలో, ప్రధానోపాధ్యాయులు ఎక్కల దేవి వెంకటేశ్వర్లు కర్ణుడి పాత్రలో, సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాస్ ధర్మరాజు పాత్రలో నటించి తమ కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. ప్రదర్శన అనంతరం సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను బతికించే ఉద్దేశంతోనే ఈ నాటక ప్రదర్శనలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కళలను ప్రభుత్వం ఆదుకోవాలని, వాటిని పునరుద్ధరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

