వైభవంగా శ్రీ ప్రత్యంగిరా శరభేశ్వరుల కళ్యాణం
మాఘమాస మఖ నక్షత్రం వేళ ఆధ్యాత్మిక శోభ
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ: హనుమకొండ చౌరస్తాలోని శ్రీ ప్రత్యంగిరా భైరవ సహిత శివశక్తి క్షేత్రం మంగళవారం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. మాఘమాస మఖ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని, లోక కళ్యాణార్థం శ్రీ ప్రత్యంగిరా శరభేశ్వరుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యంగిర ఉపాసకులు వంగల శ్రీనివాస చార్యుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ క్రతువు సాగింది. గత కొన్ని సంవత్సరాలుగా, మాఘమాసం మఖ నక్షత్రం రోజున ప్రత్యంగిరా అమ్మవారు ఈ క్షేత్రంలో వెలిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మార్క సునీల్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఎండుమిరపకాయలతో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. శివశక్తి క్షేత్రం భక్తుల పాలిట కొంగుబంగారంగా మారిందని, లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ కళ్యాణోత్సవానికి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. వందలాది మంది భక్తులు ఈ కళ్యాణ వేడుకను కళ్లారా వీక్షించి పునీతులయ్యారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమం శివశక్తి స్థలం కమిటీ సభ్యులు మార్క సునీల్ కుమార్ గౌడ్, వలస అశోక్ కుమార్, లక్కాకుల రాజు, గండ్రాతి రాజు, దేవేందర్, మహాదేవ్, నవీన్ కస్తూరి, సంపత్, పవన్, ఇతర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అత్యంత క్రమశిక్షణతో జరిగింది.
