వైభవంగా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం
మొదటి రోజు గంధం పూజ
నేడు దీపారాధన.. అన్నదానం

వాయిస్ ఆఫ్ భారత్ , పర్వతగిరి : మండలంలోని అన్నారం షరీఫ్ యాకూబ్ షావలీ బాబా ఉర్సు ఉత్సవాలు గురువారం రాత్రి గంధం సమర్పించడంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు యాకూబ్ షావలీ బాబా మజర్ (బాబా సమాధి)తో పాటు, సోదరి మహబూబీ మా, గుంషావాలి, బోలె షావలీ, గౌసేపాక్ చిల్లాలను రోజ్ వాటర్ తో గుసుల్ (శుభ్రం)చేయించి, ఆనవాయితీ ప్రకారం దర్గా ముతావలీలు (ముజావర్లు) ఇంటి నుంచి గంధాన్ని డప్పు చప్పుళ్లు, ఫకీరుల విన్యాసాలతో గ్రామ పుర వీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి బాబాకు గంధం, దట్టీలు, పూల చాదర్లు సమర్పించారు. ఊరేగింపు 3 గంటల పాటు కొనసాగింది.
ప్రత్యేక పూజలు..
మొదటి రోజు గంధం సమర్పణ కార్యక్రమంలో బాబాకు పూలు, దట్టీలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మామూనూర్ ఏసీపీ తిరుపతి, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, పర్వతగిరి సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ అధికారి ఇన్ స్పెక్టర్ రియాజ్ పాషా, మండలంలోని పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
నేడు దీపారాధన.. అన్నదానం..
అన్నారం షరీఫ్ యాకూబ్ షావలీ దర్గాలో ఉర్సు ఉత్సవాలను వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో దర్గా ముజావార్లు ఆత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండోరోజు శుక్రవారం యాకూబ్ షావలీకి భక్రతులు ప్రత్యేక పూజలతో పాటు దీపారాధన చేస్తారు. అనంతరం వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. పర్వతగిరి పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తమ సేవలు అందించగా, వక్ఫ్ బోర్డ్ అధికారులు, సిబ్బంది భక్తులకు వసతి, సదుపాయాలు కల్పించడంలో ముందుండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
