వైకుంఠధామం ధ్వంసం/Destruction of Vaikuntha Dham

అస్థికల కోసం కుటుంబ సభ్యుల ఆవేదన
వాయిస్ ఆఫ్ భారత్, హసన్పర్తి : హనుమకొండ జిల్లా, గ్రేటర్ వరంగల్లోని మొదటి డివిజన్ పరిధిలో ఉన్న వైకుంఠధామంలో దహనం చేసిన తన తల్లి అస్థికల కోసం ఓ కుమారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు వైకుంఠధామాన్ని ధ్వంసం చేయడంతో ఈ దుస్థితి ఎదురైందని ఆయన వాపోయాడు. గ్రేటర్ వరంగల్ మొదటి డివిజన్లోని ఎర్రగట్టు గుట్ట కాలనీలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చొరవతో సుమారు నాలుగేళ్ల క్రితం కాలువ కట్టపై వైకుంఠధామం నిర్మించారు. శ్రీనివాస కాలనీకి చెందిన విడపు ప్రతాప్ (గట్టయ్య కుమారుడు) తల్లి ఇటీవల మరణించగా, ఆగస్టు 29న ఆమె అంత్యక్రియలు ఇదే వైకుంఠధామంలో నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం అస్థికలు సేకరించడానికి వెళ్లగా, గుర్తు తెలియని వ్యక్తులు వైకుంఠధామాన్ని పూర్తిగా ధ్వంసం చేయడాన్ని ప్రతాప్ చూసి షాక్కు గురయ్యారు. ఆస్తిపాస్తుల కన్నా అమ్మ అస్థికలే విలువైనవని ప్రతాప్ రోదించారు. హిందూ సంప్రదాయం ప్రకారం, దహన సంస్కారాల తర్వాత అస్థికలను పవిత్ర నదుల్లో కలపడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారానికి భంగం కలిగించడం వల్ల తన తల్లి ఆత్మకు శాంతి లేకుండా పోయిందని, తమ కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ప్రతాప్ వాపోయారు. ఈ ఘటనకు కారణమైన దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.

విడపు ప్రతాప్ (మృతురాలి కుమారుడు)
