వీళ్లను గ్రీవెన్స్ కు..రానివ్వకండి!

వీళ్లను గ్రీవెన్స్ కు..రానివ్వకండి!
  • వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి
  • అధికారులకు హుకుం జారీ చేసిన గ్రేటర్ కమిషనర్ రిజ్వానా బాషా
  • చెరువుల పరిరక్షణ కమిటీపై ఫైర్
    గుర్రపు డెక్క తొలగించాలంటూ పలు మార్లు ఫిర్యాదు
  • అయినా స్పందించని బల్దియా
    కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్న కమిటీ సభ్యులు

వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాకు కోపమొచ్చింది. నగరంలోని పలు చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి చెరువులను పరిరక్షించాలంటూ పలు మార్లు ఫిర్యాదు చేసిన చెరువుల పరిరక్షణ కమిటీపై ఫైర్ అయ్యారు. గుర్రపు డెక్కను ఎప్పుడు తొలగిస్తారో చెప్పాలంటూ నిలదీసినందుకు ఒంటి కాలిపై లేచారు. మీకు దిక్కున చోట చెప్పుకోండి అంటూ ఊగిపోయారు. వీళ్లను గ్రీవెన్స్ కు రానివ్వకండి అంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కు వచ్చే వారికి సమాధానం చెబుతూ వాటిని త్వరిత గతిన పరిష్కరించేలా చూడాల్సిన కమిషనర్ ఫిర్యాదు దారులపైనే నోరు పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులు మంగళవారం సమావేశమై కమిషనర్ చర్యలపై కలెక్టర్, సీడీఎంఏ, మునిసిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.
– వాయిస్ ఆఫ్ భారత్, స్పెషల్ స్టోరీ

వీళ్లను ఇంకోసారి గ్రీవెన్స్ కు రానీయకండి..వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి..అంటూ వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులకు హుకుం జారీ చేయడంపై చెరువుల పరిరక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని పలు చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి నీరు దుర్వాసన వస్తోందంటూ పలు మార్లు ఫిర్యాదు చేసినా స్పందించని కమిషనర్ అసలు ఈ సమస్యపై గ్రీవెన్స్ కు వచ్చే పరిరక్షణ కమిటీని అడ్డుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేయడంపై మండిపడుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లోనే చెరువుల పరిరక్షణ కమిటీపై దుర్భాషలాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఏర్పాటు చేశారా లేక సమస్యలపై వచ్చే వారిని బెదిరించేందుకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ చర్యలపై కలెక్టర్, సీడీఎంఏ, మునిసిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేయనున్నట్లు చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రకటించారు.

ఎనిమిది సార్లు ఫిర్యాదు..
నగరంలోని భద్రకాళి చెరువు, చిన్న వడ్డెపెల్లి చెరువు, మట్టెవాడ కోట చెరువు, ఉర్సు రంగ సముద్రం, కట్ట మల్లన్న చెరువులో గుర్రపు డెక్క పెరిగి పచ్చిక మైదానాలను తలపిస్తున్నాయి. చెరువుల్లోని నీరు కలుషితమై దుర్వాసనను వెదజల్లుతోంది. దీంతో స్పందించిన చెరువుల పరి రక్షణ కమిటీ సభ్యులు గత మూడు నెలలుగా ఎనిమిది సార్లు వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులనుంచి ఎలాంటి స్పందన రాలేదు. చెరువుల్లో గుర్రపు డెక్క రోజు రోజుకూ పెరిగిపోతూ చుట్టు పక్కల ప్రాంతాలకు విష వావులను వ్యాపింప జేయడంపై స్పందించిన చెరువలు పరిరక్షణ కమిటీ సోమవారం మరోమారు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.

ఆగ్రహంతో ఊగిపోయిన కమిషనర్..
బల్దియాలో నిర్వహించిన గ్రీవెన్స్ కు వచ్చిన చెరువుల పరిరక్షణ కమిటీ గుర్రపె డెక్క తొలగించాలంటూ మరోమారు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఫోటోలతో సహా చెరువుల పరిస్థితిని వివరించారు. ఇప్పటికే ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. గుర్రపు డెక్కతో నీరు కలుషితం అవుతుందని, విష వాయువులతో చుట్టు పక్కల ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారంటూ విన్నవించారు. ఎప్పటి వరకు గుర్రపె డెక్క తొలగిస్తారో చెప్పాలంటూ నిలదీశారు. లేకుంటే ఇక్కడినుంచి కదిలేది లేదంటూ సూచించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా నోటికి పని చెప్పారు. మీకు ఇష్టమున్న చోట చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీళ్లను గ్రీవెన్స్ కే రానివ్వకండి అంటూ హుకుం జారీ చేశారు. మరోసారి ఇదే సమస్యపై వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ అధికారులకు సూచించారు.

మునిసిపల్ కార్యదర్శికి ఫిర్యాదు..
నగరంలోని భద్రకాళి చెరువు, చిన్న వడ్డెపెల్లి చెరువు, మట్టెవాడ కోట చెరువు, ఉర్సు రంగ సముద్రం, కట్ట మల్లన్న చెరువులో పేరుకు పోయిన గుర్రపు డెక్కను తొలగించాలంటూ ఫిర్యాదు చేసిన చెరువుల పరిరక్షణ కమిటీపై బల్దియా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వీరిని గ్రీవెన్స్ కే రాకుండా చూడాలంటూ హుకుం జారీ చేయడంపై కమిటీ సభ్యులు మండి పడ్డారు. ఈ మేరకు మంగళవారం కాశిబుగ్గలోని చిన్న వడ్డెపెల్లి చెరువు పరిరక్షణ కమిటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు పెరుమాళ్ల లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవరసర సమావేశంలో ప్రధాన కార్యదర్శి సిలువేరు నగేష్, ఉపాధ్యక్షుడు పోతన వెంకటేశ్వర్లు, కార్యదర్శి జి.క్రాంతికుమార్, కోశాధికారి మాటేటి అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులు సిలువేరు శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా చెరువుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న కమిటీ సభ్యులను కమిషనర్ అవమానించడాన్ని, బెదిరింపులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా చేసిన ఏకగ్రీవ తీర్మాణాన్ని కలెక్టర్, సీడీఎంఏ, మునిసిపల్ కార్యదర్శికి పంపించనున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *