విశ్వావసు ఉగాదికి స్వాగతం..
వాయిస్ ఆఫ్ భారత్, తెలంగాణ : ఉగాది అంటే యుగారంభం. కొత్త సంవత్సరానికి ఉగాది అని పేరు రావడానికి ప్రధాన కారణం మన హిందూ పంచాంగ ప్రకారం ఈ రోజు నుండే తిథి, వార, నక్షత్రాలు మొదలవుతాయి. చైత్ర శుక్ల పాడ్యమినాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలలో పేర్కొన్నారు. అందుకే, ఈ ప్రత్యేకమైన రోజును తెలుగువారు గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ప్రస్తుతం మనం విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మన తెలుగు పంచాంగంలో మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ సంవత్సరాలు ప్రభవంతో మొదలై 60 ఏళ్ల తర్వాత తిరిగి పునరావృతమవుతాయి. ఉగాది పండుగను యుగాది (యుగ + ఆది) అనే పేరుతో కూడా పిలుస్తారు. ఉగాది శబ్దానికి ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు. ‘ఆది’ అంటే ప్రారంభం. కనుక ప్రపంచానికి జన్మ ఆయుష్షులకు ఇది తొలి రోజు.
సంప్రదాయబద్ధంగా ఉగాది ..
ఉగాది రోజున ప్రకృతి నూతన రూపాన్ని దాలుస్తుంది. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు కొత్తగా చిగురిస్తాయి, కోయిలలు మధుర స్వరంతో కూస్తాయి. తెలుగువారి కొత్త సంవత్సరాది కావడంతో ఉగాదిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఇంటిని శుభ్రపరచడం, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం, పంచాంగ శ్రవణం చేయడం వంటి సాంప్రదాయాలు పాటిస్తారు. ఉగాది పచ్చడిని ముఖ్యంగా తయారు చేసుకుంటారు, ఇది జీవితంలోని అనేక రుచులను ప్రతిబింబించేలా ఉంటుంది – తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఉగాది ద్వారా రాబోయే సంవత్సర ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరానికి రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అనే నవనాయకులను నిర్ణయిస్తారు. వీరిని ఆధారంగా పంచాంగకర్తలు వర్షపాతం, పంటల దిగుబడి, ధాన్యధరాలు, మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తారు. చాంద్రమానం ప్రకారం ఉగాది తొలి రోజు అయిన చైత్ర శుక్ల పాడ్యమినాడు శాలివాహన చక్రవర్తి పట్టాభిషేకం జరిగింది. ఆ సందర్భంగా శాలివాహన శకానికి ఆరంభం కావడంతో, ఈ ఉత్సవం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సంప్రదాయబద్ధంగా ఉగాది రోజున మంచి పనులను ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. కొత్త ఆశయాలతో, ఆశీస్సులతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు ఉగాది మరొక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇది నూతన ఉత్సాహం, సత్ఫలితాల సూచికగా నిలుస్తుంది.
