వివేకానందుడి బోధనలు యువతరానికి ఆదర్శం
భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు
వాయిస్ ఆఫ్ భారత్, చెన్నారావుపేట : భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన వేదాంత, యోగా, తత్వశాస్త్ర పితామహుడు స్వామి వివేకానందుడిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు పిలుపునిచ్చారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న స్వామి వివేకానందుడి విగ్రహాన్ని సోమవారం ఆయన సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శివ రాములు మాట్లాడుతూ వివేకానందుడి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. యువతరం చెడు ప్రభావాలకు లోను కాకుండా సన్మార్గంలో నడవాలని అన్నారు. భారతదేశాన్ని మరింత శక్తివంతంగా తయారు చేయడానికి యువకులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. విశ్వాసం, నమ్మకం సడలిపోకుండా, భయాన్ని వీడనాడి లక్ష్యం చేరేవరకు ప్రయాణించాలని కోరారు. వివేకానందుడు చెప్పినట్లు మందలో ఉండకుండా వందలో ఒకడిగా ఉండేందుకు యువకులు ప్రయత్నించాలని శివ రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ చెన్నారావుపేట తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మార్వో ఫణి కుమార్ ను కలిశారు. చెన్నారావుపేట బస్టాండ్ సెంటర్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వివేకానందుని విగ్రహం, ఆర్టీసీ బస్టాండ్ నిర్మించిన ప్రాంతాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన భూమిని కూడా అధికారికంగా సర్వే చేయించాలని ఎమ్మార్వోకు కు విజ్ఞప్తి చేశారు. భూకబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని బయటికి తీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ వరంగల్ జిల్లా కన్వీనర్ ఆదిత్య సాయి, విశ్వహిందూ పరిషత్ వరంగల్ జిల్లా సహ కార్యదర్శి మల్యాల రవి, నర్సంపేట డివిజన్ అధ్యక్షులు చొల్లేటి జగదీశ్వర్, సురక్ష ప్రముఖ్ చరణ్ పాల్గొన్నారు.

