వివాహిత దారుణ హత్య
చంపి ఇంటి ఆవరణలో పూడ్చిన వైనం
నిందితులు భర్త, అత్తామామ పరారు
వాయిస్ ఆఫ్ భారత్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో భర్త, అత్తమామ , ఆడపడుచు కలిసి ఓ వివాహితను కిరాతకంగా హతమార్చి ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం గడుపుతున్న కాటి లక్ష్మి-రాములు దంపతులు వీరి కుమారుడు, కోడలు గోపి -నాగమణి , కూతురు,అల్లుడు దుర్గా-మహేందర్ తో కలిసి భూపతి అంజయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కొంత కాలం క్రితం గోపి నాగమణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరు కొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం నాగమణిని అత్తింటి వారంతా కలిసి హత్య చేసి అనుమానం రాకుండా ఇంటి ఆవరణలో గొయ్యి తీసి మృత దేహాన్ని గొయ్యిలో పూడ్చి వేసి, ఎవరికి అనుమానం రాకుండా ఆ గొయ్యి వరకే పేడతో అలుకు చల్లి వదిలేశారు. వారం రోజుల నుంచి నాగమణి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు నాగమణి ఎటు వెళ్లిందని ఆరా తీశారు. మృతురాలు కుటుంబ సభ్యులు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆ ఇంట్లోని చిన్నపిల్లలను అడుగగా నాగమణి చంపి గొయ్యి తీసి పాతి పెట్టారని ఇరుగుపొరుగు వారికి పిల్లలు అమాయకంగా చెప్పారు. దీంతో కాలనీ వాసులు కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీయడంతో ఇంటికి తాళం వేసి గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తహశీల్దార్ సమక్షంలో త్రవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికి తీసి పంచానామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టు మార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
