విద్యతోనే సమాజంలో గౌరవం
- శాస్త్రీయ ప్రణాళిక పునశ్చరణతో పరిక్షల్లో విజయం
- అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్స టోప్పో
- 10వ తరగతి విద్యార్థులకు జిల్లావ్యాప్త ప్రేరణ కార్యక్రమం ప్రారంభం
వాయిస్ ఆఫ్ భారత్ ( జనరల్ న్యూస్): విద్యతోనే సమాజంలో గౌరవం, ముందడుగు సాధ్యమని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ లెనిన్ వత్స టోప్పో అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాల శాతాన్ని పెంపొందించుటకై నిర్వహించే జిల్లావ్యాప్త ప్రేరణ కార్యక్రమాన్ని, సంబంధిత కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్రీయ ప్రణాళిక-పునస్చరణతో పరిక్షల్లో విజయం సాధించవచ్చన్నారు. విద్యార్థులు చదువుకునే వయసులోనే వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. చదువు అనే నిచ్చెనతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చన్నారు. విద్యార్థులు ఇటువంటి ప్రేరణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్స టోప్పో తెలిపారు. ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించే ఉచిత ప్రేరణ సదస్సులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలను పెంపొందించుట కొరకు పరీక్షల్లో విజయం సాధించాలంటే అనే అంశంపై ఉచితంగా ప్రేరణ సదస్సులు సైకాలజిస్టుల సంఘం సహకారంతో నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సద్వినియోగపరచుకోవాలన్నారు. వివరాలకు ఫోన్ నెంబర్ 9989310141 లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ డేవిడ్.వి.ఏలియా, జడ్పీ సీఈఓ రమాదేవి, జడ్పీ డిప్యూటీ సీఈవో నర్మదా, సీడీపీఓ శిరీష, జీసీడీఓ విజయ్ కుమారి, డీఎంహెచ్ ఓ డాక్టర్ అంబరీష తదితరులు పాల్గొన్నారు.
