వనదేవతల సన్నిధిలో రేవంత్ రెడ్డి
మేడారం గద్దెల పునఃప్రారంభం
మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం
అభివృద్ధి పనుల జ్ఞాపకార్థం పైలాన్ ఆవిష్కరణ
వాయిస్ ఆఫ్ భారత్, మేడారం/ములుగు : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర క్షేత్రం సోమవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పర్యటనతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రజా ప్రభుత్వ హయాంలో నూతనంగా పునరుద్ధరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలను, ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి శాస్త్రోక్తంగా పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్న సీఎం, తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన మనవడిని ఎత్తుకుని గద్దెలపైకి వెళ్లి, భక్తిశ్రద్ధలతో నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లాలని ఆయన ప్రార్థించారు.

అభివృద్ధి పైలాన్ ఆవిష్కరణ..
మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు పోరాట స్ఫూర్తిని రగిలించే మేడారం గడ్డపై గద్దెల పునర్నిర్మాణ అవకాశం లభించడం తన జీవితంలో మర్చిపోలేని పవిత్ర జ్ఞాపకమని భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రాకను పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

