లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్ష/Review on the development of Lakshmi Narasimha Swamy Temple
వాయిస్ ఆఫ్ భారత్, దేవరుప్పుల: పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మంగళవారం కడవెండి గ్రామంలోని వాసవీ దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దర్శనం తర్వాత, ఆమె మండల అధికారులు, ఎండోమెంట్స్ శాఖ అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 1 కోటి నిధులు మంజూరు చేసింది.
ఆలయ అభివృద్ధి ప్రణాళిక..
ఈ నిధులతో ఆలయ ప్రాంగణం మొత్తం పునరుద్ధరణతో పాటు, కళ్యాణ మండపం, స్నానపు గదులు, అన్నదాన సత్రం, భక్తుల కోసం తాగునీటి సౌకర్యాలు, పార్కింగ్ స్థలాలు వంటి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నందున ఆలయ అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని, నాణ్యతతో కూడిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తి ..
అధికారులు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల ప్రణాళికలను ఎమ్మెల్యేకు వివరించారు. త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే కృషి వల్ల ఆలయానికి నిధులు మంజూరు కావడం సంతోషకరమని, పనులు పూర్తయితే భక్తులకు అన్ని సౌకర్యాలు లభిస్తాయని కృతజ్ఞతలు తెలిపారు.
