రెండేళ్లలోనే మార్పు చూపించాం..
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
రాష్ట్ర మంత్రి పొంగులేటి
ఐఅండ్ పీఆర్ వెబ్‌సైట్ ప్రారంభం
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోరుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, ఆ నమ్మకాన్ని రెండేళ్లలోనే నిజం చేసి చూపించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆధునీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు.
సంక్షోభం నుంచి సంక్షేమం వైపు:
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా పెను సంక్షోభంలో ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ సంక్షోభాన్ని అధిగమిస్తూ, గత రెండేళ్లలో రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలకు చిరునామాగా మార్చామన్నారు. “వ్యవసాయం, విద్య, వైద్యం, గృహనిర్మాణం (ఇందిరమ్మ ఇళ్లు), సన్నబియ్యం పంపిణీ వంటి అంశాల్లో ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాయి” అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో సమాచార శాఖ పాత్ర కీలకమని మంత్రి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను వాడుకుని, ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వేగంగా చేరవేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్‌తో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
పారదర్శక పాలన – దేశానికే రోల్ మోడల్:
ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడేలా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చేలా సంక్షేమ పాలన అందిస్తున్నామని మంత్రి చెప్పారు. పారదర్శకత, ఆధునికతతో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఅండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్.ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్వో జి.మల్సూర్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీ.ఎస్.జగన్, జాయింట్ డైరెక్టర్ రమణ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

