రాజకీయ, సినీ రంగాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్/ TDP Maha naadu
మహానాడు రెండో రోజు జయంతి వేడుకలతో ప్రారంభం
వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పుష్పాంజలి

వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, గొప్ప నటుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని టీడీపీ మహానాడు రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానాడు వేదికపై ఏర్పాటైన ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ ముఖ్య నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మహానాడు తొలి రోజున పార్టీ బలోపేతం, ప్రజల అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిగాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి ఆరాధ్య నేతగా ప్రశంసించిన ఆయన, “ఎన్టీఆర్ జయంతి అనేది తెలుగు ప్రజలందరికీ పండుగ రోజు వంటిదని” పేర్కొన్నారు. రాజకీయ, సినీ రంగాల్లో ఏకకాలంలో అగ్రస్థానంలో ఉన్న ఘనత ఎన్టీఆర్‌దేనని, “పసుపు జెండా శాశ్వతంగా ఎగురుతూనే ఉంటుంది” అని పేర్కొన్నారు. “ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా, రైతులకు నేస్తం” అని కొనియాడారు. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు. ‘‘యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక, సంక్షేమ మార్గదర్శి అయిన ఎన్టీఆర్‌కు నా శ్రద్ధాంజలి. ఆయన తలపోయింది ఒక్కటే –నా తెలుగు జాతి గౌరవంగా బతకాలి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే మేము నడుస్తున్నాం,’’అని పేర్కొన్నారు. తన పాలన ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి, పేదల ఆకలి తీర్చిన ఎన్టీఆర్, చరిత్రను రచించిన మహనీయుడని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను సాధించేందుకు టీడీపీ కొనసాగుతున్న ప్రయత్నాల గురించి తెలిపారు.
