బ్లడ్ క్యాన్సర్‌పై అపోహలు వద్దు
ప్రముఖ హీమటాలజిస్ట్ డాక్టర్ కరుణ కుమార్
బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్‌తో ప్రాణాపాయం నుంచి విముక్తి
హనుమకొండలో అవగాహన సదస్సు
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : బ్లడ్ క్యాన్సర్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే రోగులు పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉందని ప్రముఖ హీమటాలజిస్ట్, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు డాక్టర్ కరుణ కుమార్ స్పష్టం చేశారు. గురువారం హనుమకొండలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రక్త క్యాన్సర్ లక్షణాలు ప్రారంభంలో చాలా సాధారణ అనారోగ్యంలాగే కనిపిస్తాయని, వాటిని గుర్తించడంలోనే చికిత్స విజయం దాగి ఉందని డాక్టర్ వివరించారు. ఈ కింది లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలని సూచించారు. తరచుగా జ్వరం రావడం, విపరీతమైన బలహీనత ఆవహించడం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం, ఆకస్మికంగా బరువు తగ్గడం, మెడ లేదా చంకల భాగంలో గడ్డలు (లింఫ్ నోడ్స్) రావడం, గాయాలు కాకుండానే చర్మంపై నీలి మచ్చలు ఏర్పడటం లేదా తరచుగా రక్తస్రావం కావడం జరుగుతుందని వివరించారు. “రక్త క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ఫలితాలు అత్యంత మెరుగ్గా ఉంటాయి. అపోహలను నమ్మి కాలయాపన చేయకుండా, అనుమానం ఉన్నప్పుడు వెంటనే హీమటాలజిస్ట్ను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి” అని డాక్టర్ కరుణ కుమార్ హితవు పలికారు. ఆధునిక వైద్య విధానంలో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా క్లిష్టమైన కేసులను కూడా విజయవంతంగా నయం చేయవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కాల్వ నరేష్, అసిస్టెంట్ మేనేజర్లు రాజకుమార్, స్వరాజ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
