యూరియా దందా

యూరియా దందా
Urea scam

చెన్నారావుపేటలో ఏఓ అక్రమాల గుట్టు రట్టు
సోషల్ మీడియాలో వైరలవుతున్న అధికారి ఆడియో
అసలైన రైతులకు అన్యాయం
సమగ్ర విచారణకు డిమాండ్

వాయిస్ ఆఫ్ భారత్, చెన్నారావుపేట : యూరియా కొరతతో యాసంగి రైతులు అల్లాడుతున్న వేళ, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో వ్యవసాయ అధికారి (ఏఓ) అక్రమ దందా వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. రైతులకు కేటాయించాల్సిన యూరియా టోకెన్లను అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏఓ) దళారులకు అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక అధికారి ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల వ్యవసాయ శాఖపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

టోకెన్ల మాయం.. దళారుల చేతికి ఎలా?
మండలంలోని పదహారు చింతల తండ గ్రామంలో ఈ అక్రమ విక్రయాలు జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు గ్రామ పంచాయతీల వద్ద టోకెన్లు రాయించుకున్నప్పటికీ, జనవరి 6న పెద్ద సంఖ్యలో టోకెన్లు రైతులకు కాకుండా ఇతరులకు కేటాయించబడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏఈవో (అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్) సంతకంతో పెద్ద మొత్తంలో టోకెన్లు వెలుగులోకి రావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. రైతులు ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా, సర్పంచ్ వెంటనే మండల ఏఓకు ఫోన్ చేసి వివరణ కోరారు. ఆ సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో, “రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? టోకెన్లు డబ్బులకు అమ్మారా?” అని సర్పంచ్ ప్రశ్నించగా, ఏఓ తన తప్పును అంగీకరించినట్లు స్పష్టంగా వినిపిస్తోంది. “నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి.. మళ్లీ రిపీట్ కాకుండా చూస్తాను, దండం పెడతా” అంటూ బ్రతిమాలడం ఆడియోలో రికార్డ్ అయింది. అయితే, అధికారికంగా సర్పంచ్ వివరణ కోరినప్పుడు మాత్రం “టోకెన్లు ఎలా మిస్ అయ్యాయో తెలియదు” అంటూ ఏఓ తప్పించుకునే ప్రయత్నం చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఏఓ స్వయంగా ఈ అక్రమానికి పాల్పడ్డాడా, లేక ఏఈవోలతో కలిసి వ్యవహారం నడిపించాడా అనే దానిపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

కొరతలోనూ దందా
యాసంగి పంటల సమయంలో తీవ్రమైన యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు వేదికల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా సరైన సరఫరా లేదని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టోకెన్ల అక్రమ విక్రయం జరగడం వల్ల అసలైన రైతులు నష్టపోతున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై మండల, జిల్లా స్థాయి అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని స్థానిక ప్రజలు, రైతాంగం డిమాండ్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *