మోడీ ఎత్తుగడలతో చిత్తయిన కేజ్రీవాల్
సొంత నియోజకవర్గంలోనే ఓటమి
బీజేపీని ఎదిరించాలని చూసి దెబ్బతిన్న ఆమ్ ఆద్మీ
రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు..వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సహజం. ఎదుటి పార్టీని బట్టి వ్యూహాలు పన్నాల్సి ఉంటుంది. అలా రాజకీయాలను మలుపుతిప్పడంతోనే అధికారం సాధ్యమవుతుంది. బిజెపి ఇప్పుడు ఇదే ఎత్తుగడలతో పనిచేస్తోంది. బీజేపీ ఎక్కడా మడికట్టుకుని పాతకాలపు బూజుపట్టిన సిద్దాంతాలతో లేదు. మోడీ అధికారం చేపట్టాక, రాజకీయాల గతిని మార్చారు. అందుకే ఆప్‌ను దెబ్బ కొట్టేందుకు తిరుగలేని వ్యూహం రచించారు. అవినీతి వ్యతిరేక నినాదంతో వచ్చిన కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయే వరకు వేచి చూసింది. అక్కడి నుంచే ఇక ఎదురుదాడితో రాజకీయం మొదలు పెట్టి, ఢిల్లీలో తిరుగులేని దెబ్బ కొట్టింది.
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి :
బెంగాల్ లో అనుసరించిన వ్యూహాన్ని బీజేపీ ఢిల్లీలో అనుసరించింది. మమతా బెనర్జీ బెంగాల్ లో గెలిచినా, ఎమ్మెల్యేగా ఓడారు. ఆమెను కదలకుండా చేయడంలో వ్యూహం పన్నారు. ప్రచారంలో దూకుడు ప్రదర్శించకుండా చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో అదే చేశారు. కేజ్రీవాల్‌ను ఓడించేందుకు వేసిన ఎత్తులు ఫలించాయి. వ్యూహాలు అనుకూలించాయి. ఆమ్ ఆద్మీ పేరుతో నేనో సామాన్యుడిని.. మీలో ఒకడినంటూ రాజకీయాల్లోకి వచ్చి.. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచి.. ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజీవ్రాల్ మరో సామాన్యుడి చేతిలో ఓడిపోయారు.
స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి..
ఢిల్లీ సీఎంగా ఉంటూ.. జాతీయ రాజకీయాల్లో మోదీని నిలువరించే నాయకుడిని తానేనంటూ దేశ వ్యాప్తంగా ఆప్‌ను విస్తరించే పనిలో పడ్డారు. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆప్‌ను అధికారంలోకి తీసుకొచ్చి దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌ను కాదని, తనకు మద్దుతు ఇచ్చేలా రాజకీయ వ్యూహాలు పన్నారు. చివరికి మోదీ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నారు. న్యూఢిల్లీ శాసనసభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన అరవింద్ కేజీవ్రాల్.. నాలుగోసారి అదే నియోజవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తన ప్రత్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్‌పై స్వల్ప తేడాతో ఓటమి చెందారు. తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బగా చూడాల్సి ఉంటుంది. తనను చూసి మిగిలిన 69 మంది ఆప్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేసిన కేజీవ్రాల్.. తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం బిగ్ షాక్‌గా చెప్పుకోవాలి.
మోదీ టార్గెట్‌గా కేజ్రీవాల్..
ముఖ్యంగా ఢిల్లీలో అధికారంలోకి రావడంతో పాటు కేజీవ్రాల్‌ను ఓడించాలని మోదీ టార్గెట్‌గా పెట్టుకున్నారు. బయటకు చెప్పకపోయినప్పటికీ కేజీవ్రాల్‌ను రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఓడించాలని టార్గెట్ ఫిక్స్ చేసి మరీ కేజీవ్రాల్‌ను ఓడిరచారనే ప్రచారం జరుగుతోంది. కేజీవ్రాల్ దేశ వ్యాప్తంగా తన పార్టీని విస్తరించే పనిలో మోదీని టార్గెట్ చేశారు. పరుష పదజాలంతో కేంద ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు.. ముఖ్యంగా మోదీపై పదునైనా విమర్శలు చేసేవారు.
చక్రం తిప్పాలని.. చతికలపడ్డ తీరు..
కాంగ్రెస్ పరిస్ధితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉండటంతో ఢిల్లీలో ఈసారి గెలిస్తే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనలో కేజీవ్రాల్ ఉన్నారు. కాంగ్రెస్ లేకుండా అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిపి ఓ కూటమిని ఏర్పాటు చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేజీవ్రాల్‌ను ఎమ్మెల్యేగా తన సొంత నియోజవకర్గంలో ఓడించాలనే లక్ష్యంతో పర్వేష్‌ను రంగంలోకి దింపారు. మోదీ తన లక్ష్యసాధనలో సక్సెస్ అయినట్లు ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే అర్థమవుతోంది. విద్యావంతులు, ఉద్యోగులు ఓట్లు వేసే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనూ కేజీవ్రాల్ వెనుకబడ్డారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపులో రెండు, మూడు రౌండ్లు స్వల్ప మెజార్టీ కనబర్చినప్పటికీ రెండు నుంచి మూడు వందలకు మించి అధిక్యం కనబర్చలేదు. మొత్తం 13 రౌండ్లకు గానూ మొదటి రౌండ్‌లో కేజీవ్రాల్‌పై పర్వేశ్ 74 ఓట్ల మెజార్టీ సాధించారు. రెండో రౌండ్‌లో కేజీవ్రాల్ 328 ఓట్లు ఎక్కువ సాధించారు. దీంతో కేజీవ్రాల్ స్వల్ప అధిక్యాన్ని కనబర్చారు. మూడో రౌండ్‌లో కేజీవ్రాల్ దాదాపు 90 ఓట్లు పర్వేష్‌పై ఎక్కువుగా సాధించారు. ఆ తర్వాత నాల్గవ రౌండ్ పర్వేష్ అధిక్యం సాధించగా.. ఐదో రౌండ్‌లో కేజీవ్రాల్ అధిక్యాన్ని సాధించారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో రౌండ్‌లో పర్వేష్ అధిక్యాన్ని సాధించారు. దీంతో పది రౌండ్లు ముగిసే సమయానికి పర్వేష్ .. కేజీవ్రాల్‌పై 1844 ఓట్ల అధిక్యాన్ని కనబర్చారు. మిగిలిన మూడు రౌండ్ల లెక్కింపు తర్వాత పర్వేష్ స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.
