మేడారంలో జనజాతర

మేడారంలో జనజాతర
  • కన్నెపల్లిలో గుడిమెలిగే పండగ ప్రారంభం
  • గిరి జాతరకు భారీగా తరలివస్తున్న భక్తజనం
  • ఇకపై ఆన్ లైన్ లోనే నిలువెత్తు బంగారం సమర్పణ
  • సేవలను ప్రారంభించిన మంత్రి సురేఖ


ములుగు జిల్లా మేడారంలోని కన్నెపల్లిలో బుధవారం గుడిమెలిగే పండుగ ప్రారంభమైంది. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుందని పూజారులు తెలిపారు. గుడిమెలిగే పండుగలో భాగంగా సమ్మక్క, సారలమ్మ ఆలయాల పైకప్పులను గడ్డితో కప్పారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. భక్త జనసందోహంతో మేడారం సందడిగా మారనుంది. పెద్ద ఎత్తున్న బంగారాన్ని సమ్మక్క, సారలమ్మకు భక్తులు సమర్పిస్తుంటారు. ప్రభుత్వం కూడా సదుపాయాలు కల్పించి, భక్తులకు ఇబ్బదులు రాకుండా చేస్తోంది. సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ఘనతను చాటుకోనుంది. ఉత్తరాదిలో జరిగే కుంభమేళాకు తీసిపోని విధంగా ప్రజలు ఈ జాతరను ఆరాధిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనులు పోటెత్తుతున్న తీరు చూస్తుంటే మేడారానికి ఉన్న ప్రత్యేకత వేరుగా చెప్పనక్కరలేదు. రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర కావడంతో పాటు తెలంగాణ గిరిజన జాతర కావడంతో ప్రపంచ గుర్తింపు దక్కింది..మేడారం ఉత్సవానికి జాతీయ హోదా రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటి నుంచే కృషి చేయాల్సి ఉంది. ప్రజల్లో ఎంతో భక్తి విశ్వాసం ఉంటే తప్ప ఈ జాతరకు ఇంతటి ఆదరణ దక్కదు. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి నాలుగు రోజలపాటు గద్దెలను దర్శించుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. అన్నింటికి మించి ప్రభుత్వం ఇక్కడ చేసిన ఏర్పాట్లు అమోఘం. ముఖ్యంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖలు అన్నీ తామై అధికారులను నడిపిస్తున్నారు. మొక్కులు, పూజలతో మేడారం ఆధ్యాత్మిక వనంగా మారుతోంది.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా..
మేడారం జాతర అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పనపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ అధికారులను పురమాయిస్తున్నారు. జాతర పరిసరాల్లో ఉన్న రోడ్లను విస్తరించి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతర పరిసరాలను మరింత విస్తరింపజేసేందుకు అవసరమైన భూసేకరణ కూడా చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేశారు. మేడారాన్ని కుంభమేళా తరహాలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. జాతరలో మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మేడారం జాతర వరకు ఉన్న దారులను పూర్తిగా విస్తరింపజేస్తే భక్తులకు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. ఈసారి జాతరలో భక్తులకు తాగునీటి వసతి, టాయిలెట్స్‌ను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశామన్నారు. మేడారంలో కాలుష్యం లేకుండా పారిశుద్ధ్యం పనులు ఎప్పటికప్పుడు చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో జాతరను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మేడారాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం శాశ్వత పనులు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. జాతర నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించామని మంత్రి సీతక్క తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జాతరలో మరిన్ని శాశ్వత ఏర్పాట్లు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *