మరింత ఉత్సాహంతో పని చేస్తా..

మరింత ఉత్సాహంతో పని చేస్తా..
  • ప్రకటించిన రాష్ట్ర కమిటీ
  • పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్పులు

(వాయిస్ ఆఫ్ భారత్, పొలిటికల్ న్యూస్)  భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు గంట రవికుమార్ ను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం రాత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు అధ్యక్షులను, రాష్ట్ర కమిటీ వివిధ మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించింది. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలను చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కనీసం 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర కమిటీ సూచిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంనుంచి బీజేపీ అభ్యర్థి గెలిచేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో గత అధ్యక్షుడు విఫలమయ్యాడనే విమర్శలున్నాయి. దీంతో పార్టీ అధ్యక్ష పదవి మార్పు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యాధికుడు, పార్టీకోసం కష్టపడి చేసే సీనియర్ నేత గంటా రవికుమార్ కు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఆజంజాహి మిల్లు కార్మికుడి కుమారుడైన గంటా రవికుమార్ ఎంసీఏ, ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు. సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ పేరుతో కంప్యూటర్ సంస్థను ఏర్పాటు చేసి ఎందరికో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని చేరువ చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన వేలాది మంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు.

మరింత ఉత్సాహంతో పని చేస్తా..
ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకత్వంలో, తెలంగాణలోను అధికారం దిశగా కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నాయకత్వంలో మరింత ఉత్సాహంతో పని చేస్తానన్నారు. వరంగల్ జిల్లాలో పార్టీని బడుగు బలహీన వర్గాలకు చేరువ చేయడంతోపాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జాతీయ వాద సిద్ధాంతం కలిగిన యువతకు ప్రాధాన్యం ఇస్తూ, సేవ గుణం ఉన్న యువతను రాజకీయాలలోకి వచ్చేలా కృషి చేస్తానన్నారు. జిల్లాలోని సంఘ పరివార్ పెద్దల సూచనలతో పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, దేశంలో చేస్తున్న అభివృద్ధి, ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నడిపించడంలో చేస్తున్న కృషిని, ప్రతి కుటుంబానికి చేర్చేందుకు పాటుపడుతానన్నారు. నాకు అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా పని చేస్తాన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీజేపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా అధ్యక్షుల మార్గదర్శనంలో ముందుకు సాగుతానన్నారు. బీజేపీలోని ప్రతీ కార్యకర్తను కలుపుకొని పోతానని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *