బీసీ నేత హాస్టల్‌లో సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

బీసీ నేత హాస్టల్‌లో సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
##@@Green signal for filling seats in BC Neta hostel@@@##

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ ( సెప్టెంబర్ 11) : ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో హనుమకొండలోని హంటర్ రోడ్డులో నడుస్తున్న బీసీ నేత విద్యార్థుల వసతి గృహంలో సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. గురువారం జరిగిన ట్రస్ట్ బోర్డు సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ ఛైర్మన్ సాంబారి సమ్మారావు, కోశాధికారి గజ్జెల్లి రవీందర్, డైరెక్టర్లు ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, ప్రొఫెసర్ వంగరి సూర్యనారాయణ, గౌరవ సలహాదారు వేముల సదానందం నేత తదితరులు పాల్గొన్నారు. గతంలో చేరిన విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసుకొని వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీలలో కొత్తగా విద్యార్థులను చేర్చుకోవాలని సమావేశం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 25 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వన్నాల శ్రీరాములు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న చేనేత కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ వసతి గృహం ఎంతో సహాయపడుతుందని ఆయన అన్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు అర్హులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏదైనా విద్యాసంస్థలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మసీ లేదా దానికి సమానమైన కోర్సులలో చదువుతూ ఉండాలి. స్థానిక తహసీల్దార్ జారీ చేసిన కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలు అవసరం. అడ్మిషన్ పొందిన కళాశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ తో జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలు వసతి గృహంలో అందుబాటులో ఉన్నాయని, సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వన్నాల తెలిపారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులైన విద్యార్థులకు సమాచారం అందిస్తారని, అక్టోబర్ మొదటి వారంలో అడ్మిషన్లు పొందవచ్చని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గత పదేళ్లుగా ఈ వసతి గృహం ద్వారా ఎందరో విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారని, ఇది తమకెంతో గర్వకారణంగా భావిస్తున్నామని వన్నాల పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *