బాలల సంక్షేమ విభాగంలో భారీ అక్రమాలు/ Massive irregularities in the child welfare department
రూ.లక్షకు పైగా టీఏల పేరుతో హాం ఫట్
అవినీతికి పాల్పడ్డ అధికారిపై చర్యలేవీ..?
మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలల పరిరక్షణ విభాగం (చైల్డ్ ఫ్రోటెక్షన్ యూనిట్ ) చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో గత కొన్ని నెలలుగా అనేక అవకతవకలు జరుగుతున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఏప్రిల్ మొదటి వారంలో జిల్లా ట్రైనింగ్ అండ్ వాలిడేషన్ ఆఫీసర్ (డీటీవో) ద్వారా విచారణ చేపట్టారు. డీటీవో నిర్వహించిన ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత ఎనిమిది నెలలలో స్టాఫ్ ట్రావెల్ అలవెన్సుల పేరుతో రూ.1,45,110ను అక్రమంగా తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. ప్రయాణం చేయకుండానే ఈ మొత్తాన్ని తీసుకున్నట్టు తేలినందున, సంబంధిత సిబ్బందికి రికవరీ నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ అక్రమాలకు ప్రధాన కారకుడైన మాజీ డీసీపీవోపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సిబ్బంది వాపోతున్న విధంగా, టీఏ మంజూరుకు రాజు సగం డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు మొత్తాన్ని వారి నుంచే రికవరీ చేయడం అన్యాయమని వారు అంటున్నారు. అదేవిధంగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు సరిగ్గా సిట్టింగ్స్ నిర్వహించకుండా నెలకు లక్ష రూపాయల వరకూ అక్రమంగా తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఆన్‌లైన్ రిపోర్టులు తనిఖీ చేస్తే రూ.20 లక్షలకు పైగా ప్రభుత్వ నిధులు మళ్లించిన విషయాలు బయటపడవచ్చని కంప్లెయింట్‌లో పేర్కొన్నప్పటికీ, విచారణ అధికారి వాటిపై దృష్టి సారించలేదు.
మహిళలపై వేధింపులు..
ముఖ్యంగా, గత డీసీపీవో మహిళా సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించినట్టూ పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఓ మహిళా ఔట్‌రీచ్ వర్కర్‌ను పలుమార్లు దూషించి, బెదిరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం. అంతేకాదు, ఒక దత్తత కొరకు ఆశగా ఎదురుచూస్తున్న మహిళను రూ.30,000 ఇస్తే బాబును ఇస్తానని బెదిరించినట్టూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు ఇచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిగణించకుండా, బాధ్యులైన అధికారులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం అధికారి తదితరులతో ఆ అధికారి కుమ్మక్కైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, బాధితులు, పౌర హక్కుల సంస్థలు ఈ అంశంపై ప్రత్యేక కమిటీ ద్వారా విపులమైన, నిష్పక్షపాత విచారణ జరిపించి, నిజమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
