బాటపడ్డట్టేనా?
- బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన రాజయ్య
- కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం
- అవమానాలు భరించలేకే వీడుతున్నట్లు వెల్లడించిన మాజీ డిప్యూటీ సీఎం
- అదే దారిలో పలువురు నేతలు
- ద్వితీయ శ్రేణి నాయకులది అదే బాట
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కీలక నేతలు పార్టీ మారుతారనే చర్చ జోరందుకుంది. ఎంపీ టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శనివారం బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ నెల 10న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారన్న వార్త వైరల్ గా మారడంతో ఇక తొవ్వ సాపు అయిందనే భావన వ్యక్తమవుతోంది. అదే దారిలో పయనించేందుకు మరికొందరు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ నేతలు పలువురు తమ భవిష్యత్ పై అంతర్మథనంలో పడినట్లు సమాచారం. ఎలాగైనా పవర్ లో ఉండాలి.. కాకుంటే పవర్ లో ఉన్న పార్టీలోనైనా ఉండాలన్న లక్ష్యంతో వారు బీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ద్వితీయ స్థాయి క్యాడర్ సైతం అదే బాటను ఎంచుకున్నట్లు సమాచారం.
-వాయిస్ ఆఫ్ భారత్, స్పెషల్ స్టోరీ
మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ లేఖ రాశారు. అయితే కొంతకాలంగా పార్టీలో అవమానాలను భరిస్తున్నానని, ఇక తట్టుకోలేక బటయకు రావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10న కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం ఇదే నిజమైతే ఇక వలసలకు బాట పడ్డట్టే అంటూ ప్రచారం సాగుతోంది.
అరూరిపై ఆరోపణలు..
ఓటమి పాలైన కొందరు బీఆర్ఎస్ నేతలు వచ్చే లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉన్న పార్టీ నుంచి టికెట్ రాకపోతే కండువా మార్చైనా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వ్యవహారం టాపిక్ గా మారింది. ఓటమే ఉండదనుకున్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూడగా.. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశావహులు చాలామందే ఉండటంతో అరూరి రమేశ్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దీంతో అరూరి రమేశ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటానని, తనను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రకటించారు. అదే విధంగా డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు కూడా బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఖమ్మం జిల్లా మంత్రితో మంతనాలు పూర్తయినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే బాటలో ద్వితీయ శ్రేణి నాయకులు, మునిసిపాలిటీల్లో కూడా పలువురు బీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
అసంతృప్తిగా ఉన్నా..
లోక్‌సభ ఎన్నికల వేళ తాటికొండ రాజయ్య బీఆర్ ఎస్ వీడడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ తాను పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనంటూ ప్రకటించారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరట్లేదని స్పష్టం చేశారు. బారాసలో మానసిక క్షోభకు గురయ్యా.. పార్టీలో నాకు సరైన గుర్తింపు లభించడం లేదు.. పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమే దక్కడం లేదు.. పార్టీ విధివిధానాలు నచ్చట్లేదు.. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది.. వారితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సరికాదు.. నేను 15 ఏళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నాను.. కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడా.. పరిచయాలు ఉన్నంత మాత్రాన పార్టీ మారతాననడం సమంజసం కాదన్నారు. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నాను.. నాకు చేసిన అవమానం మానసిక వేదనను, భరించలేని బాధను కలిగించింది.. ప్రస్తుత పార్టీ విధివిధానాలు నచ్చడం లేదు. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని రాజయ్య ప్రకటించారు. నాకు టికెట్ ఇవ్వకపోవడం కారణంగా మాదిగ సామాజికవర్గ అస్తిత్వం విూద దెబ్బపడిందన్నారు. నా సామాజిక వర్గానికి క్షమాపణలు చెబుతున్నా.. ఆరు నెలలుగా ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నా.. అధిష్టానం మాట్లాడుతుందని.. స్పందిస్తుందని ఎదురుచూశా.. కానీ, ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా… 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా..విధేయుడిగానే ఉన్నానన్నారు.
బీఆర్ ఎస్ కు గడ్డుకాలమే..
ముఖ్య నేతలు ప్రజల తీర్పును అంగీకరించకపోవడం కలిచి వేసిందని తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైందన్నారు. మున్ముందు ఆ పార్టీకి మరింత గడ్డుకాలం తప్పదన్నారు. స్థానిక, రాష్ట్ర నాయకత్వం లోపంతో కార్యకర్తలు, నాయకులు కష్టాల పాలవుతున్నారన్నారు. ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఈరోజుకీ లేదన్నారు. మాదిగ ఆస్థిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
అనుచరులతో మాట్లాడాకే..
నా అనుచరులు, సామాజిక వర్గ నేతలతో మరోసారి మట్లాడాలి.. అప్పుడే ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానంటూ రాజయ్య వెల్లడించారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం. కాగా తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు.ఆయన రాజీనామాతో వరంగల్‌లో రాజకీయ సవిూకరణాలు మారనున్నాయి.
