ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
#sit notice kcr@

మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికి చేరుకుని, ఆయన వ్యక్తిగత సహాయకుడికి సీఆర్‌పీసీ 160 కింద ఈ నోటీసులను అందజేశారు. జనవరి 30 (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న అనధికారిక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నుంచి వివరణ సేకరించడానికి నోటీసుల్లో సిట్ అధికారులు ఒక కీలక అంశాన్ని పేర్కొన్నారు. కేసీఆర్ వయస్సు (65 ఏళ్లు పైబడిన వారు) దృష్ట్యా ఆయన పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.”చట్టం ప్రకారం 65 ఏళ్లు దాటిన వ్యక్తులు విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సిన అవసరం లేదు. కాబట్టి, హైదరాబాద్ నగర పరిధిలో కేసీఆర్ కోరుకున్న ప్రదేశంలోనే అధికారులు ఆయనను ప్రశ్నిస్తారు.” దీంతో, కేసీఆర్ తన నివాసమైన నందినగర్‌లోనే విచారణకు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

వేడెక్కిన రాజకీయం
ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా విచారణకు హాజరయ్యారు. టి.హరీష్ రావు జనవరి 20న విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ జనవరి 23న సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జోగినపల్లి సంతోష్ కుమార్ జనవరి 27న సుదీర్ఘంగా విచారణను ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన తరుణంలో, స్వయంగా కేసీఆర్‌కు నోటీసులు అందడం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. శుక్రవారం జరిగే ఈ విచారణలో ఏయే విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *