పుష్కలంగా యూరియా నిల్వలు
తప్పుడు ప్రచారాలను నమ్మకండి
మండల వ్యవసాయ అధికారి రాకేష్
(Voice of Bharath), Damera దామెర : ప్రస్తుత యాసంగి సాగు సీజన్‌కు సంబంధించి దామెర మండలంలో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) రాకేష్ స్పష్టం చేశారు. సోమవారం దామెర రైతు వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో యూరియా కొరత ఉందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ వార్తలో వాస్తవం లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధీమా ఇచ్చారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మార్క్ ఫెడ్ ద్వారా మండలానికి వచ్చిన యూరియా వివరాలను ఏఓ వెల్లడించారు. పీఏసీఎస్ ఊరుగొండ కేంద్రం: 190 మెట్రిక్ టన్నులు, హాకా దామెర కేంద్రం: 60 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లు: 70 మెట్రిక్ టన్నులు మొత్తంగా ఇప్పటివరకు ఆయా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ సజావుగా సాగిందని ఆయన తెలిపారు. యూరియా నిల్వలు అయిపోయిన వెంటనే ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు స్టాక్ తెప్పిస్తున్నాం. ఏఈఓల పర్యవేక్షణలో గ్రామాల వారీగా రైతులకు ముందుగానే సమాచారం అందిస్తూ పంపిణీ చేస్తున్నాం. నిల్వల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులు మరియు పత్రికల ద్వారా రైతులకు చేరువ చేస్తున్నాం” అని రాకేష్ వివరించారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రామకృష్ణ, అరుణ్, సిబ్బంది పాల్గొన్నారు.
