పార్టీని కాపాడుకుంటాం..

పార్టీని కాపాడుకుంటాం..
  • కేసీఆర్ వచ్చాకే తెలంగాణలో అభివృద్ధి
  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మరో మంత్రి నిరంజన్ రెడ్డి

వాయిస్ ఆఫ్ భారత్ (పొలిటికల్ న్యూస్) ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. గెలిచినా, ఒడినా పార్టీని కాపాడుకోవడం ముఖ్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన ఆ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమాశానికి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపి పసునూరి దయాకర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..కేసీఆర్ ప్రవేశ పెట్టినన్ని సంక్షేమ పథకాలు దేశంలోనే మరెవరూ ప్రవేశపెట్టలేదన్నారు. గతంలో ఎస్సార్ ఎస్పీ కాలువ ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలోని సాగు భూములకు చుక్కా నీరు అందలేదని గుర్తు చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతే ఇక్కడి నేలలు పచ్చని పంట పొలాలుగా మారాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, రైతు భీమా, 24 గంటలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేసీఆర్ వచ్చాకే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు ఓటు వేశామని బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఆ పార్టీలో ఇప్పటికే అంతర్గత పోరు మొదలైందని జోస్యం చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంసీ సీటు బీఆర్ఎస్ దే నన్నారు. బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని కోరారు. ఉద్యమకారులైన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో జిల్లా కమిటీలను పటిష్టం చేసి, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ఓటమిపై సమీక్షించుకుని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించుకుంటున్నామన్నారు. మూడోసారి మోడీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. అక్షింతల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రైతుబంధు ఇవ్వకుండా నోట్లో అరటిపండు పెట్టిందన్నారు. కేసీఆర్ కంటే గొప్పగా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏమైందన్నారు. ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయారన్నారు. వంద రోజుల్లో కాకపోతే ఐదు సంవత్సరాలలోపు మీ హామీలు నెరవేర్చండి లేకుంటే ప్రజలు మీ హామీలపై నిలదీస్తారంటూ హెచ్చరించారు.

ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ…గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పోటీపడిన విధంగానే వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడాలన్నారు. రైతుబంధు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కోసం ఆయా వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్ రావు, జిల్లా రైతు బందు కో ఆర్డినేటర్ లలితా యాదవ్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, సర్వర్, కార్పొరేటర్లు, పాక్స్ చైర్మన్లు, మండల, డివిజన్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *