పాక్‌ ఆర్మీ మళ్లీ ప్రేలాపనలు/ Pakistan Army protests again

పాక్‌ ఆర్మీ మళ్లీ ప్రేలాపనలు/ Pakistan Army protests again
Pakistan Army protests again

“నీరు ఆపితే ఊపిరి ఆపడమే” అంటూ బెదిరింపులు

లష్కరే తోయిబా స్టైల్లో పాక్‌ ఆర్మీ వ్యాఖ్యలు

 భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌”

భారత్‌ను ఉగ్రవాదులు రెచ్చగొట్టేలా మాట్లాడే విధంగా పాకిస్థాన్‌ సైన్యం కూడా ప్రవర్తిస్తోంది. తాజాగా పాక్‌ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన భారత్‌పై గట్టిగా విరుచుకుపడుతూ సింధూ నదిపై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
     వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి :

పాక్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన షరీఫ్‌ చౌదరి, “భారత్‌ మా నీటిని ఆపేస్తే, మేము వారి ఊపిరిని ఆపేస్తాం. సింధూ నదిలో జలాల బదులు వారి రక్తం పారుతుంది,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ గతంలో చేసిన బెదిరింపులను గుర్తుచేస్తున్నాయి.

సింధూ జలాల ఒప్పందం నిలిపివేతపై పాక్‌ ఆక్రోషం..
ఏప్రిల్‌ 22న కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాడికి పాక్‌ మద్దతు ఉన్నట్టు భారత గూఢచార సంస్థలు కీలక ఆధారాలు సేకరించాయి. దీంతో, దాడికి ప్రతిగా భారత్‌ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై పాక్‌ రాజకీయ నాయకులతో పాటు సైనిక అధికారులు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు.

హఫీజ్‌ సయీద్‌ వ్యాఖ్యలే మళ్లీ?..
అహ్మద్‌ షరీఫ్‌ వ్యాఖ్యలు గతంలో హఫీజ్‌ సయీద్‌ చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే ఎక్కువ తేడా లేదు. గతంలో హఫీజ్‌ కూడా, “నీరు ఆపితే రక్తం పారుతుంది,” అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్‌ ఆర్మీ ప్రతినిధి కూడా అదే తీరుగా మాట్లాడటం గమనార్హం.

విమర్శల వర్షం..
ఆఫ్ఘాన్‌ మాజీ పార్లమెంటు సభ్యురాలు మరియం సొలెమాన్‌ఖిల్‌ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఒక దేశ సైనిక అధికారి ఇలాంటి భాష వాడటం అనవసరం అని ఆమె అన్నారు. పాక్‌ అధికారులు ఉగ్రవాదుల స్క్రిప్ట్‌ను చదివేలా ఉందని ఆమె విమర్శించారు.

సింధూ జలాల నేపథ్యం..
1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం, భారత్‌, పాక్‌ మధ్య నదీజలాల వినియోగానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ పాకిస్థాన్‌ మద్దతుతో భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో న్యూఢిల్లీ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇకపై ఈ విషయంలో పాక్‌ నుండి మరిన్ని విమర్శలు, హెచ్చరికలు రావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్‌ తీసుకున్న నిర్ణయం పాక్‌ను తీవ్ర అసహనానికి గురిచేస్తుండగా, అక్కడి సైన్యం కూడా రెచ్చిపోయే ప్రయత్నం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *