నేషనల్ హైవే కార్యాలయం ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశాలు
న్యాయవాదులు సుధాకర్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ యాదవ్
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : నేషనల్ హైవే 163 రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నందుకు గాను, నేషనల్ హైవే అథారిటీ కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని హనుమకొండ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు సిబ్బంది, బాధితుల తరపు న్యాయవాదులు, భూ నిర్వాసితులు బుధవారం హనుమకొండలోని హంటర్ రోడ్డులో ఉన్న నేషనల్ హైవే కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం, కార్యాలయ ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని జప్తు చేయడానికి కోర్టు సిబ్బంది ప్రయత్నించగా, మేనేజర్ ఇతర ఎన్‌హెచ్‌ఏఐ ఉద్యోగులు వారిని అడ్డుకున్నట్లు భూ నిర్వాసితుల తరపు న్యాయవాదులు దయ్యాల సుధాకర్, గునిగంటి శ్రీనివాస్ గౌడ్, మరియు నరేందర్ యాదవ్ తెలిపారు. కోర్టు విధులకు ఆటంకం కలిగించి, సామాగ్రిని జప్తు చేయకుండా నిరోధించినట్లు వారు చెప్పారు. కోర్టు సిబ్బంది తమ విధులకు ఆటంకం కలిగించవద్దని కోరినప్పటికీ, నేషనల్ హైవే సిబ్బంది వారిపై దురుసుగా ప్రవర్తించి, “మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ పరుష పదజాలం ఉపయోగించినట్లుగా న్యాయవాదులు పేర్కొన్నారు. సుమారు 13 గ్రామాల ప్రజలు 2013లో నేషనల్ హైవే కోసం తమ భూములను కోల్పోయారు. ఆ సమయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నామమాత్రపు పరిహారాన్ని చెల్లించి, రోడ్డు నిర్మాణం చేపట్టిందని ఆరోపించారు. దీనిపై పైడిపల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు జిల్లా కలెక్టర్, ఆర్బిట్రేటర్ వద్ద అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్‌లో భాగంగా, 2015లో అప్పటి జిల్లా కలెక్టర్, ఆర్బిట్రేటర్ స్క్వేర్ మీటర్‌కు రూ.400 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంచిన పరిహారాన్ని నిర్వాసితులకు చెల్లించడంలో నేషనల్ హైవే అథారిటీ జాప్యం చేయడంతో, జిల్లా న్యాయమూర్తి ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఈ ఆదేశాలను కూడా నేషనల్ హైవే కార్యాలయ సిబ్బంది అమలు చేయకుండా అడ్డుకున్నారని భూ నిర్వాసితుల తరపు న్యాయవాదులు దయ్యాల సుధాకర్, గునిగంటి శ్రీనివాస్ గౌడ్, నరేందర్ యాదవ్ తెలిపారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ పట్ల నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలిచిందని న్యాయవాదులు అన్నారు.
