నేతన్నల గోడు పట్టదా?
సిరిసిల్లపై కేంద్రానిది మొండివైఖరి
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ ఘాటు లేఖ
పదేళ్లుగా విన్నవిస్తున్నా మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఊసేది?
8 మంది ఎంపీలున్నా సిరిసిల్లకు అన్యాయమే
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక జాప్యం చేస్తూ, తెలంగాణపై వివక్ష చూపుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు (కేటీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గత పదేళ్లుగా వినిపిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. “అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ కాలం నుండి నేటి వరకు ప్రతి మంత్రిని వ్యక్తిగతంగా కలిసి విన్నవించాం. సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధ్రువీకరించినా, ఇంకా పెండింగ్‌లో పెట్టడం వెనుక మర్మమేమిటి?” అని ప్రశ్నించారు. 30 వేలకు పైగా పవర్ లూమ్స్ ఉండి, వేలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్న సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఇతర రాష్ట్రాల ప్రాంతాలకు క్లస్టర్లు ఇచ్చి, తెలంగాణను విస్మరించడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అని విమర్శించారు. రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా, కేంద్ర మంత్రివర్గంలో చోటు ఉన్నా సిరిసిల్ల నేతన్నల గొంతుక కావడంలో వారు విఫలమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారని ఎద్దేవా చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌నైనా వేదికగా చేసుకుని మెగా క్లస్టర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో చేనేత సంక్షోభం:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని, నేతన్నల ఆత్మహత్యల వార్తలు వినాల్సి రావడం ఆవేదన కలిగిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచిందని, నేడు పరిస్థితులు మారుతున్న తరుణంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని మెగా క్లస్టర్ మంజూరు చేయాలని కోరారు. లేనిపక్షంలో కేంద్రం నేతన్నల పొట్ట కొట్టినట్లే అవుతుందని హెచ్చరించారు.
