ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత.. వ్యూహ, ప్రతి వ్యూహాల్లో దిట్ట.. ఓటమెరుగని నేత.. ఆర్థిక, అర్ధ బలం ఆయనకు కొండంత అండ.. విలక్షణమైన వ్యక్తిత్వం ఆయన సొంతం.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచి తనకు ఎవరూ సాటిలేరని నిరూపించుకున్న జనహృదయాకరుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇంతటి మహోన్నత వ్యక్తికి ఆపదొచ్చింది. ఆయన రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓటుకు నోటు కేసులో తనను ఎర్రబెల్లి ఇరికించారన్న కోపంతో సీఎం రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయనపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు పవర్ లోకి రావడంతోపాటు ఏకంగా ముఖ్యమంత్రి సీటులోనే రేవంత్ ఆశీనులయ్యారు. దీంతో దయాకర్ రావుపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉంటాయోనన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఆయనను నమ్ముకున్న అనుచరులు ఎర్రబెల్లితో కలిసి పయనిస్తారా..? లేదంటే కాంగ్రెస్ వైపు చూస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
-వాయిస్ ఆఫ్ భారత్, స్పెషల్ స్టోరీ
రాజకీయ ఉద్దండుడిగా పేరు గడించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని యువతి చేతిలో ఓటమిపాలు కావడం, రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికితోడు ఓటుకు నోటు కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావు తనను ఇరికించారన్న కోపంతో సీఎం రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఎర్రబెల్లిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు పనిచేసిన దయాకర్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని యువతిని పోటీకి నిలిపి అన్నంత పని చేశాడు. ఇప్పడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఓటమిపాలైన దయాకర్‌రావు ఇంటికి పరిమితమయ్యారు. అయితే మాజీ మత్రి పరిస్థితి ఏంటి అనేది సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. అంతేకాకుండా, ఆయనను నమ్ముకున్న అనుచరులు ఎర్రబెల్లితో కలిసి పయనం చేస్తారా..? లేదంటే కాంగ్రెస్ వైపు చూస్తారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కొండాతో వార్.. కొండా దంపతులతో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆది నుంచే రాజకీయ వైరం ఉంది. మొదటినుంచి వారు ఉప్పు నిప్పులాగే ఉండేవారు. కొండా, ఎర్రబెల్లి ఒకరిపై ఒకరు హత్యాయత్నానికి కూడా ప్రణాళికలు రచించుకున్నారని ప్రచారంలో ఉంది. గతంలో తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడు దయాకర్‌రావు తన పలుకుబడితో కొండా దంపతులను ముప్పు తిప్పలు పెట్టగా తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దయాకర్‌రావు టార్గెట్‌గా పనిచేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కొండా దంపతులు, అటు దయాకర్‌రావు ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే, ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడ లేవు అన్నట్లుగా కొండా దంపతులు తిగిరి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన కొండా సురేఖ గత ఎన్నికల్లో పర్కాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికలో దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు. దీంతో మళ్లీ కొండా దంపతులే టార్గెట్‌గా ఎర్రబెల్లి పనిచేశారు. ఇప్పుడు దయాకర్ రావు పాలకుర్తిలో ఓడిపోయారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మరి కొండా దంపతులు తమ అగర్భ శ్రతువు దయాకర్‌రావును టార్గెట్ చేస్తారా.. లేదా వదిలేస్తారా చూడాలి..? జిల్లాలో కొండా వ్యూహాన్ని దయాకర్‌రావు ఎలా చేధిస్తారో వేచి చూడాల్సిందే..
యువతి చేతిలో పరాభయం.. పాలకుర్తి.. పోరాటల పురిటిగడ్డ.. నిజాం ఆరాచకాలపై ఎదురొడ్డి పోరాడిన చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ.. అదే స్ఫూర్తితో 26 ఏళ్ల యువతి మామిడాల యశస్వినిరెడ్డి 46 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావును మట్టికరిపించారు. ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి 40 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచి ఎర్రబెల్లి సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టింది. మంత్రిగా ఉన్నప్పుడు దయాకర్‌రావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ అనేక కేసుల్లో ఇరికించారు. వారిని ముప్పు తిప్పలు పెట్టారు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వారికి అండగా నిలిచే పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ సమయంలో కార్యకర్తలకు ఆక్సిజన్‌లా మారారు అనుమాండ్ల ఝాన్సీరెడ్డి. ఈమె అమెరికాలో స్థిరపడినప్పటికీ సొంతగడ్డకు ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. అయితే, ఈ సారి ఎన్నికల బరిలో నిలవాలని నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగారు. కేవలం 26 రోజుల ముందే నియోజకవర్గంలో కాలుమోపి ప్రజాదరణ పొందారు. అయితే, ఓడిపోతానని ఊహించని దయాకర్ రావు ఝాన్సీరెడ్డి పౌరసత్వం సాకుతో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ దక్కకుండా చేశారు. దీంతో ఝాన్సీరెడ్డి ఆమె కొడలు మామిడాల యశస్వినిరెడ్డిని బరిలో దించారు. ఎన్నికల సమయంలో అత్తాకొడలుపై ఎర్రబెల్లి అనేక ఆరోపణలు చేశారు. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఎన్నికల ముందు రోజు వారిని స్థానికంగా లేకుండా చేయాలని పోలీసులతో వారిని తొర్రూరు నుంచి బయటకు వెళ్లగొట్టాలని ప్రయత్నం చేశారు. ఇద్దరు మహిళలు రోడ్డుపైకి వచ్చి దయాకర్ రావు ఆరాచకాన్ని ప్రజలకు వివరించారు. ప్రజల్లో సానుభూతి రావడంతో పాటు భారీ మెజార్టీతో యశస్వినిరెడ్డి గెలిచారు. ఆమె ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే, ఇన్ని రోజులు తమ కార్యకర్తలను, తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన మాజీ మంత్రి దయాకర్‌రావును, బీఆర్‌ఎస్ నాయకులను వదిలేస్తారా..? లేదంటే వారిని టార్గెట్ చేస్తారా..? వారి దందాలను ఒక్కొక్కటిగా బయటకి తీస్తారా..? అనేది నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది.
సొంత పార్టీ నేతలతో చిటపటలు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రత్యర్థి పార్టీ నేతలతోనే కాదు.. సొంత పార్టీ నేతలతోనూ వైరం ఉంది. తాజాగా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరికి.. దయాకర్‌రావుకు మధ్య ఎప్పటినుంచో చిటపటలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరిద్దరు గతంలో తెలుగుదేశంలో పనిచేశారు. అప్పడు శ్రీహరి మంత్రిగా, దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వీరద్దరికీ అప్పటి నుంచి అభిప్రాయ బేధాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పడు దయాకర్ రావు ఓడిపోయి శ్రీహరి విజయం సాధించడం ఆయనకు మింగుడు పడని అంశంగా మారింది. బీఆర్‌ఎస్‌లో కడియంకు ప్రాధాన్యం పెరగడంతో దయాకర్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా మంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా చిన్నచూపు చేసేవారని, లోపాయికారి నిర్ణయాలతో వారిని ఇబ్బందులకు గురి చేసేవారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలు కూడా మాజీ మంత్రిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. =================