డ్రగ్స్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి/Be vigilant about drugs and cybercrime
ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్, కమలాపూర్ (సెప్టెంబర్ 11) : డ్రగ్స్, సైబర్ నేరాల ఉచ్చులో పడి ప్రజలు జీవితాలను పాడు చేసుకోవద్దని కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సూచించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో మండల ముఖ్య అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, సీఐ, ఎస్సైలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను అమ్మినా, కొనుగోలు చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పల్లెల్లో కూడా సైబర్ నేరాల సంఖ్య పెరిగిందని, ఉద్యోగం, అధిక లాభాల పెట్టుబడులు, ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో మోసగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ఆన్‌లైన్ లోన్‌లు తీసుకోవద్దని, చైన్ సిస్టమ్ బిజినెస్‌లలో పడి ఆర్థికంగా నష్టపోవద్దని కోరారు. ముఖ్యంగా మహిళలు, యువతులు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు పోస్ట్ చేయవద్దని, మార్ఫింగ్ ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాల నుంచి తమను తాము కాపాడుకోగలరని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
