డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహాబూబ్‌నగర్‌లో ఒక్క సాగునీటి ప్రాజెకు పూర్తి కాలేదన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
ఈ అంశంపై చర్చకు మీరు సిద్దామా? అంటూ కాంగ్రెస్ మంత్రులకు ఆయన సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు విలేకర్లతో మాట్లాడుతూ.. మధిరకు రమ్మన్నా వస్తా.. అలాగే అసెంబ్లీకి, సచివాలయం రమ్మన్నా లెక్కలతో సహా వస్తా.. మీరు చర్చకు సిద్ధమా చెప్పండంటూ నేరుగా సవాల్ విసిరారు.
అబద్దాలు చెబితే మీ విశ్వసనీయత తగ్గుతుందంటూ కాంగ్రెస్ నేతలను ఆయన సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో మహబూబ్ నగర్ లో 6 లక్షలకుపైగా ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమేనని.. కానీ 6 నుంచి 7 లక్షల కోట్లు అప్పు చేశారంటూ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులపై అడ్డగోలు అబద్దాలు చెబుతున్నారంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై.. హరీష్ రావు నిప్పులు చెరిగారు. రెండు నెలల క్రితం మహబూబ్‌నగర్‌లో ఋణమాఫి కింద సీఎం ఇచ్చిన 2,700 కోట్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా వారి ఖాతాల్లో పడలేదన్నారు. సీఎం చేతుల మీదుగా ఇచ్చిన చెక్కుకు పతార లేదు… డమ్మీ చెక్కు ఇచ్చారా? లేదా మోసం చేసారా? స్పష్టం చేయండంటూ కాంగ్రెస్ మంత్రులను డిమాండ్ చేశారు. అందరికి రుణమాఫీ అని చెప్పి.. కొందరికే చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రైతులనే కాదు కూలీలను సైతం కాంగ్రెస్ సర్కారు దగా చేసిందన్నారు. అయితే ఎగవేతలు లేదంటే.. కోతలు సర్కార్ తీరు ఇదంటు స్పష్టం చేశారు. కాంగ్రెస్ మోసాలపై పోరాటానికి అందరూ సిద్ధం కావాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి జాబ్ కార్డులు ఉంటే.. కోటి 2 లక్షల మంది పని చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పది లక్షల మందికి పరిమితం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఐదు గుంటలు ఉన్న వారికి రైతు భరోసా కింద ఏడాదికి రూ. 1500 వస్తాయి.. అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు వస్తాయంటే.. ఒక రైతుకు రూ. 10 వేల ఐదు వందల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు 24. 57 లక్షల మంది ఉన్నారని.. ఎకరాలోపు భూమి ఉన్న వారిని రైతు కూలీలుగా గుర్తించండంటూ రేవంత్ సర్కార్ కు సూచించారు. ఇందులో దళిత, గిరిజన, బీసీలు అధికంగా ఉన్నారని .. అయితే వారికి శఠగోపం పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. 10 శాతం మందికి భరోసా ఇస్తామని 90 శాతం మందికి కోత పెడుతున్నారన్నారు. పథకం ఇవ్వడం ఇష్టం లేకపోతే ప్రజలను క్షమించమని అడగాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయక కీలక సూచన చేశారు. ప్రతి ఉపాధి హామీ కూలికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలన్నారు. లేదంటే ప్రభుత్వంపై కూలీలు తిరగబడతారంటూ తస్మాత్ జాగ్రత్త అని రేవంత్ రెడ్డి సర్కార్ కు సూచించారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
