జంధ్యాల పౌర్ణమి అంటే ఏమిటి?/What is the full moon of the zodiac?

ఆ పండుగ ఎలా జరుపుకుంటారు..
శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించేవారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము ‘యజ్ఞము’ ‘ఉపవీతము’ అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే ‘యాగము’ ‘ఉపవీతము’ అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్థము. యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు.
ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు. దీనికి అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద్యాధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం.
యఙ్ఞోపవీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యఙ్ఞోపవీతం దివ్యౌషధం. ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు.
రాంపెల్లి లింగమూర్తి నేత
అఖిల భారత పద్మశాలి సంఘం
వరంగల్ జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జి

