చిన్నారి గోలి శ్రీ వైష్ణవికి సత్కారం
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : హనుమకొండలోని 5వ డివిజన్, రెడ్డి కాలనీ, సుభాష్ నగర్లోని శ్రీ విఘ్నేశ్వర యూత్ గజానన మండలి వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మయూరి నాట్య కళా మండలి వ్యవస్థాపకురాలు కుండె అరుణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నీలిమా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోలి రవి-శ్రావణిల కుమార్తె గోలి శ్రీ వైష్ణవి తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వైష్ణవి ప్రదర్శనకు ముగ్ధులైన శ్రీ విఘ్నేశ్వర యూత్ గజానన మండలి సభ్యులు, ఎమ్మెల్యే సతీమణి నీలిమా రెడ్డి చేతుల మీదుగా ఆమెకు సత్కారం చేసి షీల్డ్ బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నీలిమా రెడ్డి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి ప్రదర్శనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, శ్రీ విఘ్నేశ్వర యూత్ గజానన మండలి నిర్వహాకుడు గణేష్, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు, నాట్య విద్యార్థులు, మహిళులు పాల్గొన్నారు.
