చిన్నపిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

చిన్నపిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్
Child kidnapping gang arrested

వణుకుపుట్టిస్తున్న ముఠా దందా
అయిదుగురు చిన్నారుల సురక్షిత రెస్క్యూ

వాయిస్ ఆఫ్ భారత్, కాజీపేట : వరంగల్ నగరంలో కలకలం సృష్టించిన చిన్నపిల్లల కిడ్నాప్‌ల కేసును కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఛేదించారు. ఐదు నెలల పసికందు కిడ్నాప్‌తో పాటు గతంలో జరిగిన మరో నాలుగు కిడ్నాప్‌లకు పాల్పడిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, అపహరణకు గురైన ఐదుగురు చిన్నారులను సురక్షితంగా రక్షించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను పెద్దపల్లి జిల్లా ఘవాపూర్ గ్రామానికి చెందిన కొడుపాక నరేష్ (42), శాంతినగర్‌కు చెందిన వెల్పుల యాదగిరి (32) గా గుర్తించారు. గత డిసెంబర్ 28, 2025 తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడు, 5 నెలల మల్లన్న కిడ్నాప్‌పై ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా కాజీపేట, టాస్క్ ఫోర్స్ బృందాలు విచారణ చేపట్టాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం అద్దె కారులో వచ్చిన నిందితులు మళ్లీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే ఉద్దేశంతో కాజీపేట రైల్వే స్టేషన్ ఫుట్‌పాత్ వద్ద రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు వారిని అనుమానాస్పదంగా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు తాము డిసెంబర్ 28న కిడ్నాప్ చేసిన మల్లన్నతో పాటు గతంలో మరో నలుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. పిల్లలు కలగని దంపతులను లక్ష్యంగా చేసుకొని, ఈ పిల్లలను అనాథాశ్రమాల నుంచి తీసుకొచ్చినట్లు నమ్మబలికి, డబ్బులకు అమ్ముకున్నట్లు నిందితులు తెలిపారు. కిడ్నాప్ చేసి అమ్మిన చిన్నారులు మల్లన్న (5 నెలలు, డిసెంబర్ 2025, కాజీపేట): జన్నారం మండలం లింగయ్యపల్లిలో అమ్మకం, పాప (10 నెలలు, ఆగస్టు 2025, వరంగల్ రైల్వే స్టేషన్): మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో విక్రయం, బాబు (3 సంవత్సరాలు, అక్టోబర్ 2023, కాజీపేట రైల్వే స్టేషన్) జన్నారం మండలంలో అమ్మకం, పాప (5 నెలలు, అక్టోబర్ 2025, మంచిర్యాల రైల్వే స్టేషన్): మంచిర్యాలలో విక్రయం, పాప (10 నెలలు, జూన్ 2025, రామగుండం రైల్వే స్టేషన్): జగిత్యాల జిల్లాలో అమ్మినట్లు నిందితులు అంగీకరించారు. నిందితుల నేర ఒప్పుకోలు ఆధారంగా అపహరణకు గురైన 5 నెలల బాబు మల్లన్నతో సహా మొత్తం ఐదుగురు చిన్నారులను పోలీసులు రెస్క్యూ చేశారు. అదేవిధంగా, ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండా పిల్లలను కొనుగోలు చేసిన దంపతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల కిడ్నాప్‌లకు పాల్పడిన ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్, కాజీపేట పోలీస్ స్టేషన్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించి, రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్, కాజీపేట ఏసీపీలు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *